ఇటీవల విడుదలైన దేసీబాయ్జ్‌లో ప్రొఫెసర్‌గా అత్యంత ఆకర్షణీయంగా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది చిత్రాంగద సింగ్. తనకు సన్నిహిత దర్శకుడైన సుధీర్ మిశ్రా తాజాగా తీస్తున్న ఇంకార్ సినిమాలో ఈ బ్యూటీ మరోసారి చాన్స్ కొట్టేసింది. ఈ 31 ఏళ్ల తార ఇంకార్‌లో లైంగిక వేధింపులకు గురయ్యే కార్పొరేట్ ఉద్యోగిగా కనిపిస్తుంది. ఈ పాత్ర చేయడానికి ప్రత్యేక శిక్షణ ఏమీ అవసరం లేదని, తన గతానుభవం చాలన్నది ఈమె అభిప్రాయం.
‘లైంగిక బాధితురాలిగా నటించడానికి ప్రత్యేకమైన సాధనేమీ అవసరం లేదన్నది నా నిశ్చితాభిప్రాయం. చాలా మంది మహిళలకు ఇది నిత్యం ఎదురయ్యే సమస్యే! స్కూళ్లలో, కాలేజీల్లో చాలా మందికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి’ అని చిత్రాంగధ వివరించింది. ఇంకార్‌లో చిత్రాంగదకు బాస్‌గా కనిపించే అర్జున్ రాంపాల్ ఆఫీసు కేబిన్లలో ఆమెను లైంగికంగా వేధిస్తాడు.
నిజజీవితంలో ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నావా అన్న ప్రశ్నకు చిత్రాంగద ‘లేదు’ అని జవాబు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులు సర్వసాధారణ సమస్యే అని, ప్రాంతాన్ని బట్టి తీవ్రత మారవచ్చని అభిప్రాయపడింది. ‘ఇలాంటి బాధితురాలిని పోషించడానికి ప్రత్యేకమైన పరిశోధన ఏమాత్రం అవసరం లేదు.
మేం చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి సైకిళ్లపై వచ్చేటప్పుడు ఆకతాయిలు అడ్డగించి ఇబ్బందిపెట్టేవాళ్లు. కాలేజీకి వెళ్లాక కూడా ఇదే సమస్య. కార్పొరేట్ ప్రపంచం కూడా ఏమీ శుద్ధమైనది కాదు. అందంగా, హుందాగా కనిపించే వాళ్లే అక్కడ వేధిస్తారు’ అని చిత్రాంగద సింగ్ వివరించింది. దీప్తినావల్, సౌరభ్ శుక్లా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుంది.