ఉద్యమాలు, ఆందోళనలు, బందుల మూలంగా థియేటర్లు మూతపడటంతో విడుదలైన చిత్రాలు నష్టాల బారినపడ్డాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కే మార్గాన్ని తెలుగు చిత్రసీమ తెలుసుకొంది. అదే... సినిమాకి బీమా చేయించడం! బీమా కొత్త కాదు కదా అనుకోవచ్చు... షూటింగ్ సమయంలో జరిగే నష్టాన్ని పూడ్చుకొనేందుకు చేయిస్తుంటారు. అయితే విడుదలయ్యాక కలిగే అవాంతరాలు, ఇబ్బందుల మూలంగా ప్రదర్శనలు నిలిచిపోతే కూడా బీమా సొమ్ము పొందవచ్చు. ఇటీవల విడుదలైన సలీమ్, అవతార్ చిత్రాలు బీమా రక్షణ పొందాయి. రాబోయే చిత్రాలకీ నిర్మాతలు ప్రీమియం కట్టేస్తున్నారు.
గతేడాది 'దోస్తానా' విడుదలైన సమయంలో... ముంబయిలో తీవ్రవాదుల దాడులు జరిగాయి. ఫలితంగా ఆ నగరంలో థియేటర్లు మూతపడ్డాయి. ఫలితంగా 'దోస్తానా' వసూళ్లకు గండిపడింది. అయితే కరణ్ జోహర్ విడుదలకు ముందే బీమా సంస్థ నుంచి పాలసీ తీసుకోవడం మూలంగా నష్టాన్ని భర్తీ చేసుకోగలిగారు. అలాగే ఈ యేడాది 'కమీనే' సినిమా వచ్చాక స్వైన్ ఫ్లూ దెబ్బపడింది. పుణె, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఆగిపోయాయి. అప్పుడూ సదరు నిర్మాతనీ, పంపిణీదారుల్ని కాపాడింది బీమాయే! ఈ పాలసీ తీసుకొనే విధానం ఇటీవలే తెలుగులో మొదలైంది.
ఈ తరహా సదుపాయాల ఆలోచన ముక్తా ఆర్ట్స్ అధినేత సుభాష్ ఘయ్‌దని చెబుతున్నారు. ఈ రంగంలో అనుభవం ఉన్న సుధీర్ మాట్లాడుతూ ''ఇప్పటి వరకూ దాదాపు అయిదు వందల హిందీ చిత్రాలకు బీమా చేయించారు. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే చేయిస్తున్నారు. సుభాష్ ఘయ్ ఆలోచన కాబట్టి సరదాగా దీన్ని ముక్తా పాలసీ అంటారు. పాలసీ ప్రీమియమ్ కోసం మరీ ఎక్కువ ఏమీ చెల్లించనవసరం లేదు. సినిమా పెట్టుబడిలో 0.5 శాతం చెల్లించాలి. విడుదలైన అరవై రోజుల వరకూ బీమా సదుపాయం లభిస్తుంది. ఆర్థికపరమైన కారణాలతో ప్రింట్లు ఆగిపోతే వర్తించదు. ప్రకృతి ప్రకోపాలు, ఆందోళనలు లాంటి కారణాలతో ప్రదర్శన ఆగిపోతే బీమా వస్తుంది'' అన్నారు. కాస్కో, అదుర్స్, శంభో శివ శంభో, గోలీమార్ తదితర చిత్రాలకి బీమా చేయించారు.
|