భారతీయ చిత్ర పరిశ్రమ 2013తో వందేళ్లు పూర్తి చేసుకోనుండడంతో ఆ వేడుకలను ఎలా జరుపుకోవాలనే బాలీవుడ్ సినీ ప్రముఖులు ఇటీవల సమావేశమయ్యారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెరైక్టర్స్ అసోసియేషన్(ఐఎఫ్‌టీడీఏ) నగర శివార్లలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఈ నెల 8న నిర్వహించిన ఈ సమావేశంలో సీనియర్ నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. 2012లోనే దేశవ్యాప్తంగా ఈ వేడుకలను ప్రారంభించి 2013 వరకు జరుపుకోవాలని నిర్ణయించారు. ప్రముఖ నిర్మాత యశ్‌చోప్రా నేతృత్వంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఆయనకు మన్మోహన్ శెట్టి, రణ్‌ధీర్ కపూర్, మహేశ్ భట్ తదితరులు సహకారమందిస్తారని తెలిసింది.
వేడుకల నిర్వాహక కమిటీకి ఐఎఫ్‌టీడీఏ వైస్ ప్రెసిడెంట్ అశోక్ పండిట్ అధ్యక్షుడిగా కొనసాగుతారని, గోల్డీ భెల్, వింటా నందా తదితరులు కమిటీ సభ్యులుగా సహకారమందిస్తారని సమాచారం. ఈ విషయమై దర్శకనిర్మాత విపుల్ షా మాట్లాడుతూ.. ‘ఇదో గొప్ప కార్యక్రమం. ఎప్పటికీ గుర్తుం డిపోయేలా ఈ వేడుకలను జరుపుకొంటామని భావిస్తున్నా. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఈ వేడుకల కోసం ఓ దగ్గరకు చేరుతుంది. కేవలం దేశంలోనేకాకుండా విదేశాల్లో కూడా ఈ వేడుకలను జరుపుకోవాలనుకుంటున్నాం. అందుకు అవసరమైన చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. మరి కొన్ని వారాల్లో ఈ వేడుకల విషయమై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంద’ని చెప్పారు. మరో సినీదిగ్గజం మహేశ్‌భట్ మాట్లాడుతూ... ‘సినీ జగత్తు యావత్తు ఇప్పుడు ఈ వేడుకలపైనే దృష్టి సారించింది.
భారతీయ సినిమాకు మెరుగులు దిద్దిన ఎందరో కళాకారులు, టెక్నీషియన్లు ఈ వేడుకల్లో భాగస్వాములవుతారు. ఈ వేడుకలు దేశ సినీపరిశ్రమ చరిత్రలో మరో మైలురాయిగా మిగిలిపోతాయి. ఈ వేడుకల్లో అన్ని భాషల దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్లు పాల్గొంటార’ని చెప్పారు. ‘గురువారం జరిగిన సమావేశంలో వందేళ్ల వేడుకల విషయమై చర్చించాం. పాల్గొన్నవారు తమ అభిప్రాయాలను, ఆలోచనలను సూచనప్రాయంగా తెలియజేశారు. లైల్ షోలు, టీవీ కార్యక్రమాలు, రేడియో కార్యక్రమాలు ఏడాదంతా నిర్వహించాలని కొందరు సూచించారు. ఇది కేవలం తొలి ఆలోచన మాత్రమే. భవిష్యత్తులో ఈ విషయమై మరిన్ని చర్చలు జరుగుతాయి. అన్ని భాషల దర్శకులు కూడా తమ తమ ఆలోచనలను తెలియజేసిన తర్వాత వేడుకలకు తుదిరూపునిస్తాం. అందుకు మరికొన్ని వారాలు పట్టే అవకాశముంద’ని బాలీవుడ్ సినీ ప్రముఖుడు కెన్ ఘోష్ తెలిపారు.