Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
సినిమా అతిథులు : చాలా ఖరీదు

     ఆ మధ్య ఢిల్లీలోని ఓ ప్రముఖుని ఇంట్లో ఓ పెళ్ళి జరిగితే, దానికి షారూఖ్ కు ఆహ్వానం అందింది. అది మామూలుగా అతిథికి వచ్చే ఆహ్వానంలాంటిది కాదు. వివాహానికి హాజరయ్యే అతిథుల్ని అలరిస్తే షారూఖ్ అడిగినంత డబ్బులిస్తామని అందులో వుంది. నెలల తరబడి కష్టపడి షూటింగ్ ల్లో పాల్గొంటే వచ్చే ఆదాయం కేవలం అరగంటలోనే వస్తుండటంతో దానిని వదులుకోవడానికి షారూఖ్ మనసు అంగీకరించలేదు. వెంటనే తన అంగీకారాన్ని తెలపడమే కాదు, ఆ పెళ్ళికి హాజరయ్యి ఎంటర్ టైన్ మెంట్ చేసి అధికమొత్తంలో డబ్బును సంపాదించుకున్నాడు. ఈ విషయం తెలిసిన సహచర స్టార్స్ లో కూడా ఇదేదో బాగుందనిపించింది. వారూ షారుఖ్ ని ఆదర్శంగా తీసుకుని ఫాలో అవుతున్నారు. ఆగర్భ శ్రీమంతుడైన గోవాని ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని డాన్స్ చేసినందుకు సదరు స్టార్స్ మూడున్నర కోట్ల రూపాయలు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆడిన బిపాసాబసుకు డెబ్బై లక్షలరూపాయలు, రాణిముఖర్జీకి యాభై లక్షల రూపాయలు, ఇమ్రాన్ హష్మీకి ముప్పై లక్షల రూపాయలు, నితిన్ ముఖేష్ కు ఇరవై లక్షల రూపాయలు ముట్టాయి. ఇదే కార్యక్రమానికి అక్షయ్ కుమార్ కి ఆహ్వానం అందింది. అయితే తనకు ఆరు కోట్ల రూపాయలు ఇస్తేనే వినోదింపజేస్తానని, లేనట్లయితే రానని ఖచ్చితంగా చెప్పాడట. దాంతో షారుఖ్ ని బుక్ చేశారట. ఏమనుకున్నాడో ఏమో అక్షయ్ కూడా ఇప్పుడు బెట్టు చేయకుండా నాలుగు కోట్లకు ఒప్పుకుంటున్నాడట.

ప్రైవేటు ఫంక్షన్స్ వీరికి ఓ పెద్ద ఆదాయ మార్గంగా మారింది. గొప్పోళ్ళ ఇళ్ళల్లో జరిగే వేడుకలకు అయ్యే ఖర్చులో ఈ స్టార్స్ కు ఇచ్చే రెమ్యునరేషనే ఎక్కువ అవుతుండటం గమనార్హం.స్టార్స్ కి డబ్బుకి డబ్బూ వస్తోంది... అటు ఆటవిడుపుగా కూడా వుంటోంది. అందుకే వారు ఇలాంటి ఈవెంట్స్ లో పాల్గొనడానికి తెగ తాపత్రయపడిపోతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్, ఐశ్వర్యరాయ్, శిల్పాశెట్టి, కరీనాకపూర్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనె వంటి తారలకు బాగా డిమాండ్ వుంది.ఈ మధ్య ఓ ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన కార్యక్రమంలో నర్తించి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది శిల్పాశెట్టి. లక్ష్మీ మిట్టల్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో ఐశ్వర్యరాయ్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది.ఆమె ఎంటర్ టైన్ మెంట్ కు ఆ లక్ష్మీ పుత్రుడు మూడు కోట్లు కానుకగా ఇచ్చుకున్నాడు. ఇందులో చాలామంది డబ్బులు తీసుకోవడానికే మొగ్గుచూపుతుంటే, ఇంకొందరు ఆ డబ్బుకు సరిపడా గిఫ్టులు కావాలంటూ ఓ లిస్ట్ ఇస్తున్నారట. అందులో విదేశీ కార్లు, నగలు, ఫ్లాట్స్ వంటివి కూడా వుంటున్నాయి.

అయితే అందరూ ఈ పార్టీలకు హాజరయి సంపాదించుకోవాలనుకోవడం లేదు. ఇలాంటి కార్యక్రమాల్ని వ్యతిరేకించేవారూ వున్నారు. అందులో అనిల్ కపూర్, అజయ్ దేవగన్, కాజోల్, అయేషా టకియా తదితరులున్నారు. అయితే సినిమా తారలుగా తమ పని ప్రేక్షకుల్ని వినోదింపజేయడమే కాబట్టి... ఇది కూడా ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించిందే కాబట్టి తాము చేస్తున్నది తప్పుకాదని సమర్థించుకుంటున్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005