వేళ్లమీద లెక్కపెట్టుకునే విజయవంతమైన చిత్రాలు విడుదలైన ఈ సంవత్సరం భారీ అంచనాలు పెట్టుకున్న కొన్ని క్రేజీ
ప్రాజెక్టులు ఎటువంటి ప్రభావం ప్రేక్షకులపై చూపించలేక చతికిలపడ్డాయి. ఈ సంవత్సరం మొదట్లో జనవరి నెలలో బాలకృష్ణ,
దాసరి నారాయణరావుల కాంబినేషన్‌లో వచ్చే సినిమా కదా అని నందమూరి అభిమానులు ముందుగానే పండుగ
చేసుకున్నారు. పైగా సంక్రాంతి హీరో బాలయ్యకు ఆ సినిమా తప్పనిసరిగా మరో హిట్ అవుతుందని భావించారు. టైటిల్
కూడా ‘పరమవీర చక్ర’ అనగానే అంతా మరో బొబ్బిలి పులి అవుతుందని అనుకున్నారు.
తీరా సినిమా కాస్తా అంచనాలను అందుకోలేక నీరుగారిపోయింది. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్‌పై జూ.ఎన్టీఆర్‌తో
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘శక్తి’ సినిమా కూడా విడుదలకు ముందు ఎవరెస్ట్ అంచనాలను రేకెత్తించింది. ఈ
చిత్రంలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. క్షేత్రపాలకుని కథతో వచ్చిన ‘బధ్రీనాధ్’ చిత్రం అల్లు అర్జున్,
వి.వి.వినాయక్‌ల కాంబినేషన్ కావడం, గీతా ఆర్ట్‌స బ్యానర్‌లో నిర్మితమవడం అన్నీ వెరసి ఆ చిత్రానికి అంచనాలు
ఆకాశమంత ఎత్తుకు చేర్చాయి. సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడకపోయినా కలెక్షన్లలో ఫర్వాలేదనిపించుకుంది. మరో
సారి ఇటువంటి చిత్రాన్ని చేస్తే ప్రేక్షకులు నిస్పందేహంగా చూడమని తేల్చి చెప్పకనే చెప్పినట్లయింది.
పవన్‌కళ్యాణ్ వరుస ఫ్లాపులతో ఉండి ఒక్కసారిగా ‘పంజా’ జూలు విదిలిస్తాడని అతని గెటప్ చూసి ప్రతి ఒక్క రూ ‘పంజా’
చిత్రంపై భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. ఆ చిత్రం కూడా మిశ్రమ ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చిం ది. పూరి
జగన్నాథ్ అనగానే ప్రేక్షకులలో ఓ భారీ అంచనాలు ఉంటాయి. ఇడియట్, పోకిరి, దేశముదురు చిత్రా లు ప్రేక్షకుల మదిలో
మెదులుతాయి. పూరి, రానాల కాంబినేషన్‌లో అదే రేంజ్‌లో సినిమా వస్తుందని అనుకున్నారంతా...‘నేను-నా రాక్షసి’
చిత్రం ప్రేక్షకుల అంచనాలను తలక్రిందులు చేసింది. కృష్ణవంశీ చిత్రాలకు కూడా ప్రేక్షకులలో ఓ అంచనాలు ఉంటాయి.
పైగా గోపీచంద్-తాప్సీల కాంబినేషన్ అని కొండం త అంచనాలు పెట్టుకున్నారు ‘మొగుడు’ సినిమాపై...ఆ చిత్రా న్ని
కూడా ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఇక కమల్‌హాసన్ కూతురు శృతిహాసన్, సిద్దార్థ జంటగా సంవత్సరం మొదట్లో క్రేజీ
ప్రాజెక్టుగా విడుదలైన ‘అనగనగా ఓ ధీరుడు’, సునీల్, రాంగోపాల్‌వర్మల కాంబినేషన్‌లో వచ్చిన ‘కె.ఎస్.డి.అప్పల్రాజు’
చిత్రాలు సైతం ఫలితాలు తిరగబడేలా చేశాయి.