బాలీవుడ్ సొట్టబుగ్గల నటి దీపికాపదుకునే తాజాగా తన భాయ్ ఫ్రెండ్ ను మార్చినట్లు ఇండస్ట్రీలో గుప్పుమంది.
ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా తనయుడు సిద్దార్థమాల్యాతో దీపికా ఈ మధ్య చెట్టాపట్టాలేసుకుని తిరగడమే
దీనికి కారణమట. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు
చెప్పుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఇద్దరిలో ఏ ఒక్కరు వెల్లడించనప్పటికీ సల్మాన్ ఖాన్ సోదరి బర్త్ డే పార్టీలో
వారిద్దరూ ప్రవర్తించిన తీరు చూసిన వారంత కూడా ఇది నిజమేనని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని దగ్గరి నుంచి
చూసిన వారిలో ఒకరు మాట్లాడుతూ ‘బర్త్ డే పార్టీకి దీపికా, సిద్దార్థ ఇద్దరూ కలిసే వచ్చారు, కలిసే వెళ్లారు.
అక్కడున్నంత సేపు కూడా ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఒక నిమిషం కూడా ఉండలేదు’ అన్నారు. ‘సిద్దార్థ
పార్టీలో ఎంతో ఎంజాయ్ చేశాడు. ఎంతో ఉత్సాహంగా కూడా కనపడ్డారు. దీపిక ఆల్కహాల్ కు దూరంగా ఉంది.
అందరితో కూడా సాధారణంగానే మాట్లాడారు. ఇద్దరూ కలసే అక్కడి నుంచి వెళ్ళారు’ అని అక్కడున్నవారిలో
ఒకరు వ్యాఖ్యానించారు. గతంలో కూడా వీరిద్దరూ లాక్మే ఫ్యాషన్ వీక్ లో కలిసే పాల్గొన్నారు.
దీపికా, సిద్దార్థల మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది అని ఆరా తీస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి (ఐపిఎల్) క్రికెట్
మ్యాచ్ ప్రారంభం నుంచే వీరిద్దరి మధ్య అనుబంధం మొగ్గతొడిగిందట. దీనికి కారణం దీపిక బెంగళూరు రాయల్
ఛాలెంజర్స్ జట్టులో భాగస్వామిగా ఉండడమే. ఈ జట్టుకు విజయ్ మాల్యా స్పాన్సర్ గా ఉన్న విషయం తెలిసిందే.
స్టేడియంలో ఉన్నంత సేపు వీరిద్దరి మధ్య ఉన్నది వృత్తిపరమైన అనుబంధం అని, మంచి స్నేహం మాత్రమేనని
ప్రచారం సాగింది. ఇద్దరూ కూడా స్టేడియంలో హంగామా చేయడంతో పాటు వివిధ ఈవెంట్స్, పార్టీల్లోనూ కలిసే
పాల్గొన్నారట. అయితే ఈ కొత్త అనుబంధం గురించి ఆరాతీస్తే సిద్దార్థతో తనకున్నది వృత్తిపరమైన అనుబంధం
మాత్రమేనని సెలవిచ్చిందట ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం ఇలా ఉంటే తన డేటింగ్ ను పదిలపరుచుకోవడం కోసం
సిద్దార్థ తన బరువును తగ్గించే పనిలో బిజీగా ఉన్నాడట. ‘ఎవరికి వారు బరువు తగ్గించుకోవాలని చూస్తారు అంతే
కానీ ఇతరుల కోసం కాదు. అతను ఫిట్ నెస్ ను పెంచుకోవాలనుకుంటున్నాడు. అది అతనికి మంచిది
అనిపించవచ్చు అంతేకానీ అందులో వింతేముంది’ అని దీపికా ప్రశ్నించింది.
చాలాకాలంగా రణబీర్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న దీపిక అతని నుంచి దూరంగా ఉంటుందట. ఆ ఖాళీని భర్తీ చేయడం
కోసమే తన కొత్త డేటింగ్ ను సిద్దార్థతో మొదలుపెట్టిందట. కొద్ది రోజుల క్రితమే దీపిక మాజీ ప్రియుడు రణబీర్ మరో
బాలీవుడ్ అగ్రతార కత్రీనాకైఫ్ తో జతకట్టాడనే వార్తలు గుప్పుమన్నాయి. కత్రీనా కూడా తన మాజీ లవర్ సల్మాన్ ఖాన్
కు గుడ్ బై చెప్పిందట.
మొత్తం మీదా ఇరుపక్షాల మధ్య పాత అనుబంధాలు తెగతెంపులయ్యాయని బాలీవుడ్ లో చెవులు
కొరుక్కుంటున్నారు. వాటి స్థానంలో ఇప్పుడు కొత్త కొత్త అనుబంధాలు ఏర్పడడంతో ఎవరూ ఎవరితో ఎన్నాళ్లు
తిరుగుతారో అర్థం కాక బాలీవుడ్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయట. మరి దీపిక, సిద్దార్థల అనుబంధం
మరెంతకాలం వరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే.
|