విమర్శలను విజయానికి మెట్లుగా మలచుకొని వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నానని ఎవర్‌గ్రీన్ హీరో దేవానంద్ చెప్పారు. ఆరు దశాబ్దాలకుపైగా బాలీవుడ్‌లో ఉన్న తాను ఎప్పుడూ ఇలాగే భావించానని తెలిపారు. ఈ 88 ఏళ్ల నటుడు నగరంలో మంగళవారం జరిగిన ‘ఎన్‌డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ కార్యక్రమంలో లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. ‘ఈ అవార్డు నన్ను గతం(1945)లోకి తొంగిచూసేలా చేసింది. సినిమాల్లో తొలి బ్రేక్ ఇచ్చిన ఏడాది అది. అప్పటినుంచి ఇప్పటివరకు అదే అంకితభావంతో పనిచేస్తున్నా. నేను ఎన్నో కొత్త తరాలను చూశా.
ఇంకా చూస్తూనే ఉన్నా. అభిమానుల ప్రేమ, ప్రశంసలు పొందా. విమర్శలు, తిరస్కారాలూ చవి చూశా. కానీ విమర్శలను ఎప్పుడూ విజయానికి మెట్లుగా భావించా. జీవితాంతం ఇలాగే ఉంటా’ అని వివరించారు. దేవానంద్ తన నట ప్రస్థానంలో ‘గైడ్’, ‘బాజీ’, ‘జివెల్ థీఫ్’ వంటి హిట్లిచ్చారు. తర్వాత దర్శకుడిగానూ మారారు. ‘హరే రామ హరే కృష్ణా’, ‘దేశ్‌పర్దేశ్’లను విజయవంతంగా తెరకెక్కించారు. కానీ ఆయన ఇటీవల రూపొందించిన ‘లవ్ ఎట్ టైమ్స్ స్క్వేర్’, ‘సెన్సార్’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అంతేగాక విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. కానీ అవి దేవానంద్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. కాగా లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ఆయన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికాసోనీ చేతుల మీదుగా అందుకున్నారు.
|