వేదం, మిరపకాయ్, వాంటెడ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ దీక్షాసేత్. అటు తమిళం, ఇటు తెలుగు భాషా చిత్రాలతో దూసుకెళుతోంది. నిప్పు, ఊ కొడతారా ! ఉలిక్కిపడతారా ! సినిమాలు రాబోతున్నాయి. తమిళంలోనూ పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తోంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి ఇలా తెలుపుతోంది...
* ఒకే ఒక విజయంతో రాకెట్ వేగంతో దూసుకెళ్లిపోవాలనే ఆశ లేదు. దేనికైనా కొంచెం సమయం పడుతుంది. వేదం మంచి సినిమా. ఫలితం ఆశించినంతగా లేకపోయినా. అందిరికీ తృప్తినిచ్చింది. ఇక వాంటెడ్ సంగతంటరా... కమర్షియల్ హంగులు కాస్త ఎక్కువయ్యాయి. అయినా నాకు అవకాశాలు సరిపోయినన్ని లభించాయి. ప్రస్తుతం రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇంకా కొత్త కథలు వింటున్నా.
* రవితేజ 'నిప్పు' సినిమాలో నా పాత్రలో గ్లామర్ పాళ్లు కాస్త ఎక్కువే. మంచు మనోజ్‌తో చేస్తున్న సినిమాలో చాలా తమాషా అయిన రోల్ ఉంది. ఏదో ప్రతి సినిమాలోనూ ఓ హీరోయిన్ కావాలి కదా ! అన్నట్టుండదు. కథలో కీలకమైనది. చాలా ఇంట్రస్ట్‌గా ఉంటుంది.
* నా కెరీర్ ఇప్పుడే మొదలైంది. కథల ఎంపిక నా చేతుల్లో లేని వ్యవహారం. కొంత అనుభవం వచ్చిన తర్వాత నేనే నిర్ణయం తీసుకుంటా. అప్పటి వరకూ దర్శకులు అడిగిందే చేస్తా. ఇక గ్లామర్ విషయానికొస్తే, కథ, సన్నివేశంలో ఉండే డిమాండ్‌ను బట్టి ఉంటుంది.
* చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఉంది. అయితే అలాంటి అవకాశం దొరకదు. మనం ఎన్నో అనుకుంటాం. అన్నీ జరగవు. చిరు సినిమాలో ప్రత్యేక గీతమైనా సరే..అనందంగా ఒప్పుకొంటా. ఇప్పుడున్న యువ కథా నాయకులందరితో నటించాలని ఉంది.
* ప్రస్తుతం ఇండిస్టీలో కొనసాగాలంటే... హీరోయిన్‌గా కొన్ని పాటించాలి. గ్లామర్ మేయింటేన్ చేయాలి. ఒళ్లు చేస్తే ఎన్ని సమస్యలొస్తాయో నాకు తెలుసు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడుతున్నా. ఆహార విషయంలోనియమాలు పాటిస్తాను. మితాహారాన్నే తీసుకుంటా. అనవసర ఆలోచనల్ని దరిచేరనివ్వను. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రధానం.
* ప్రేక్షకులతో అనుసంధానమయ్యే కార్యక్రమాలంటే చాలా ఇష్టం. పరస్పర ఆలోచనల్ని పంచుకొనే వీలు చిక్కుతుంది. మాక్కూడా కాస్త కొత్తగా ఉంటుంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలకు తరచూ హాజరవుతా. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన పరాయి నటిని అనిపించుకోకూడదు. పదేళ్లయినా ఇక్కడే నిలవాలి. పట్టున్న పాత్రలు చేయాలి. ఇవే నేను కోరుకుంటున్నది.