Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
మత్తుకు సినిమాలోకం దాసోహం!

     టాలీవుడ్‌ డ్రగ్స్‌ రాకెట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. మనిషిని మరోలోకంలోకి తీసుకెళ్లి పరవశం కలిగించే కొకైన్‌, హెరాయిన్‌ వంటి మత్తుమందులకు (డ్రగ్స్‌)కు బానిసైన వారు సినీ మాయాలోకంలో చాలామందే ఉన్నారు. ఒక్కసారిగా కోట్లాది రూపాయలు వచ్చిపడడంతో ‘సొసైటీ లైఫ్‌’ పేరుతో పబ్‌లు, క్లబ్‌లు, రిసార్ట్‌లకు అలవాటుపడి డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. మరికొందరు డ్రగ్స్‌ను అమ్ముతూ, సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. టాలీవుడ్‌లో ఒక్కసారి క్లిక్‌ అయితే చాలు ఆఫర్ల మీద ఆఫర్లు, దాంతో డబ్బు వచ్చిపడుతుండడంతో కొత్తవారు కూడా డ్రగ్స్‌ దారి తొక్కుతున్నారు. కొందరు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు సైతం .. బాబు..లను డ్రగ్స్‌కు బానిసలు చేస్తున్నారు. సినీ పరి్ర శమ అంటే డబ్బు మాత్రమే కాదు, డ్రగ్స్‌ కూడా అని కొత్త అర్థం చెప్పాల్సి వస్తోంది. ‘డాన్‌శీను’ తమ్ముళ్ళు భరత్‌, రఘు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరిని విచారించి, ఉగాండా దేశస్థుడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా దిగ్భ్రాంతి కలిగించే నిజాలు తెలుస్తున్నాయి. ఇందులో సినీ ప్రముఖులతో పాటు రాజధానిలో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజగుట్ట ప్రాంతాల్లో నివసించే అమాత్యులు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ సంతానమే ఎక్కువగా ఉండటం గమనార్హం. తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది మత్తుమందులు వాడుతున్నట్లు ఆరోపణలు వచ్చినా తాజా సంఘటన వెలుగు చూసేంతవరకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సందర్భాలు లేవు.

టాలీవుడ్‌లోని ఆ కొందరు ఎవరు?
గతంలో మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేసిన నిర్మాత వెంకటేశ్వరరావు చాలా విషయాలు బయటపెట్టాడు. జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో పబ్‌ నడుపుతున్న ఒక యువ హీరోకు డ్రగ్స్‌ లావాదేవీలతో సంబంధాలు ఉన్నట్లు ఆనాడే వెల్లడైంది. తాజాగా ఈ జాబితాలోకి చాలామందే చేరుతున్నారు. ప్రధానంగా ఇటీవలే రాజకీయ ఇతివృత్తంతో సినిమా తీసిన హీరో, చిన్నపాటి సినిమాల ద్వారా ఎక్కువ సినిమాలు చేసిన మరో హీరో, హెచ్‌ ఇంగ్లీష్‌ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక మహిళా క్యారెక్టర్‌ ఆర్టిస్టు, వి అక్షరంతో పేరు మొదలయ్యే కామెడీ హీరో, ఇటీవలే పాపులర్‌ అయిన ఇద్దరు హీరోయిన్లు, లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు, వెరైటీ సినిమాలు తీస్తున్న హీరోయిన్‌తో పాటు ఇప్పుడిప్పుడే రంగప్రవేశం చేస్తున్న నూతన నటీనటులకు సైతం ఈ వ్యవహారాలతో సంబంధాలున్నట్టు సమాచారం. ఇటీవల నగర శివారులోని మౌంట్‌ ఒపెరా రిసార్ట్‌లో గిరి అనే నిర్మాత ఒక సినిమా షూటింగ్‌ నిర్వహిస్తున్నాడు. కొంతేసేపు షూటింగ్‌ అయిన తర్వాత బ్రేక్‌ సమయంలో నటీనటులందరు కూల్‌డ్రింక్‌లు, మందు, సిగరెట్లలో మత్తుమందు (డ్రగ్‌) వేసుకొని నిద్రపోయారు. తెల్లవారి నిర్మాత షూటింగ్‌కు వచ్చినా నటీనటులు రాలేదు. ఏమైందని ఆరా తీస్తే డ్రగ్స్‌ తీసుకొని వారంతా నిద్రపోయినట్లు తేలింది.

మత్తుమందులు కొనుగోలు చేస్తూ హీరో సోదరులు పట్టుబడిన నేపథ్యంలో అటు టాలీవుడ్‌, ఇటు పొలిటికల్‌, ఐఎఎస్‌, ఐపీఎస్‌ వర్గాల్లో సైతం ఇది చర్చనీయాంశమైంది. నగరంలోని 9 పబ్‌లలో మత్తుమందుల వ్యాపారం జరుగుతోందని నగర కమిషనర్‌ ఎ.కే.ఖాన్‌ స్వయంగా చెప్పారు. ఉన్నత వర్గాలు, సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది పబ్‌లకు వెళ్తుంటారు. తమ పిల్లల పేర్లు ఎక్కడ బయటపడతాయో అని వారు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తరమండలం కంటే పశ్చిమ మండలంలోనే ఎక్కువగా పబ్‌లు ఉన్నాయి. సినీప్రముఖులే కాక, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కూడా పబ్‌లకు వెళ్ళడం ఫ్యాషన్‌గా మారింది. గతంలో బేగంపేట్‌ ప్రాంతంలో ఒక పబ్‌లో అమ్మాయిలు ముద్దు విషయంలో గొడవకు దిగడం... పోలీసులు వెళ్ళినా పట్టించుకోకుండా గొడవపడటం గమనార్హం.

ప్రస్తుతం ఉగాండా, నైజీరియన్‌ దేశీయులు విక్రయిస్తున్న కొకైన్‌, హెరాయిన్‌ గ్రాము 50వేల రూపాయ ధర పలుకుతోంది. కాబట్టి ధనవంతులైతేనే కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో విదేశాలకు చెందిన నల్లజాతీయులు కేవలం పబ్‌లు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి పిల్లలతో ఎక్కువగా సాన్నిహిత్యం పెంచుకున్నట్లు తెలుస్తున్నది. ప్రముఖులతో వెళ్తున్న విదేశీయులను పోలీసులు తనిఖీ చేయరు. దీన్ని అవకాశంగా తీసుకున్న విదేశీయులు తమ వ్యాపారం నిరాఘాటంగా సాగడానికి ఉన్నత వర్గాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తున్నది. దాంతో వారు చాలాసార్లు తెలివిగా తప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ కొత్వాల్‌ ఖాన్‌ తన వద్ద 61 మంది ప్రముఖుల సెల్‌ఫోన్‌ నెంబర్లు ఉన్నట్లు ప్రకటించారు. అయితే పోలీసుల విచారణలో ఈ సెల్‌ఫోన్లు, గతంలో పోలీసులకు చిక్కిన నైజీరియన్‌ దేశస్థుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ రాకెట్‌లోని మరో 330 మంది సెల్‌ఫోన్లు నంబర్లు లభించినట్టు తెలుస్తున్నది. సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు వివరాలు వెల్లడించలేమని, దర్యాప్తు ముందుకు సాగుతుందని భావించలేమని స్పష్టం చేశారు. అందుకే గత కొంతకాలంగా ప్రత్యే నిఘాతో వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005