మాదకద్రవ్యాల వ్యవహారం హైదరాబాద్‌లో ప్రకంపనలను సృష్టిస్తోంది. ప్రముఖ హీరోలు, హీరోయిన్లు
మాదక ద్రవ్యాల వినియోగదారుల జాబితాలో ఉన్నారని స్వయంగా నగర పోలీసు కమిషనర్ ఏకేఖాన్
వెల్లడించిన గంటల్లోనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హీరోలు, హీరోయిన్లు
మత్తుమందులను వాడడమేకాదు.. ఏకంగా వాటి వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడవుతోంది.
ఒక ప్రముఖ నటుడు, అవకాశాలు తగ్గిపోయిన మరో హీరో మాదకద్రవ్యాల వ్యాపారులుగా మారినట్టు
పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితోపాటు మరో నలుగురైదుగురు నటులు కూడా ఈ వ్యాపారం
చేస్తున్నట్టు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా, ముంబయి నుంచి మాదకద్రవ్యాలను దిగుమతి
చేసుకుంటున్నట్టు సమాచారం. మాదకద్రవ్యాలను కొంటూ వ్యాపారం నిర్వహిస్తున్న ఆ నటుడు సెలబ్రిటీ
కావడం, పలుకుబడి ఎక్కువగా ఉండడంతో పోలీసులు వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం.
పూర్తిస్థాయిలో ఆధారాలు, సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా విదేశీయులు చేస్తున్న మాదకద్రవ్యాల వ్యాపారం కేసును పరిశోధిస్తున్న పోలీసులకు
దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలుస్తున్నాయి. సినీహీరో రవితేజ సోదరులు రఘు, భరత్‌ల మాదిరిగా
మరికొందరు నటులు కూడా సిగరెట్‌లో కొకైన్‌లు తీసుకుంటున్నారని భావించిన పోలీసులకు కొందరు
నటులు వ్యాపారం కూడా చేస్తున్నట్టు గుర్తించారు. కొకైన్ గ్రాము రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు
విక్రయిస్తున్న నైజీరియన్లను గమనించి.. వీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు అనుమానిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం పట్టుకున్న చిమా క్లెమెట్, ఎఢ్హిల్, అంతకుముందు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న
ఇద్దరు ఉగాండావాసుల ద్వారా నగరంలో జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులు ఆరా తీశారు.
హైదరాబాద్‌లో ఏటా రూ.500కోట్ల మేరకు కొకైన్, బ్రౌన్‌షుగర్, ఛరస్ విక్రయాలు జరుగుతున్నట్టు
సమాచారం. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం.. పూర్తిస్థాయిలో వాటిని
హైదరాబాద్‌లో నిల్వచేయడం వంటి వ్యవహారాలను నైజీరియన్లే చూస్తున్నారు. స్థానిక భాష, ఆంగ్లం
కూడా వారికి సరిగా అర్థం కాకపోవడంతో కొందరు నటులు వారితో నేరుగా 'డీల్స్'
కుదుర్చుకుంటున్నారు. వచ్చిన లాభాల్లో 60 శాతం నైజీరియన్లకు, 40 శాతం నటులకు లభిస్తోంది.
సినిమాలతో పాటు బిజినెస్‌లోనూ అగ్రశ్రేణికి ఎదిగిన ఓ నటుడు.. కొకైన్ అమ్మకాల ద్వారా వచ్చే
లాభాలపై ఆసక్తి లేకపోయినా స్టార్ హీరోయిన్లు, ముఖ్యుల కోసం ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
విజయవంతమైన హీరోగా పేరు తెచ్చుకొని స్టార్‌డమ్ పోయిన ఓ యువ హీరో, మరో సహాయ నటుడు
వ్యాపారం నిర్వహిస్తున్న వారిలో ఉన్నారు. బంజారాహిల్స్‌లోని స్టార్ హోటళ్లలో గదులు తీసుకుని
కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
కొన్ని పబ్బుల యాజమాన్యాలు నైజీరియన్లు ఇచ్చే వాటా కోసం ప్రత్యేకంగా పార్టీలు నిర్వహిస్తున్నారు.
దీంతోపాటు ఓ మోస్తరు భారీ చిత్రాలు నిర్మించే సినిమా నిర్మాతలు, నటులు.. ముంబయి, చెన్నైకు
చెందిన హీరోయిన్లు, మోడళ్లను పబ్బులకు తీసుకువచ్చి డ్రగ్స్ రుచి చూపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో
రెండు, బంజారాహిల్స్‌లో రెండు, బేగంపేటలో ఒక పబ్బులో కొకైన్ వినియోగం సర్వసాధారణంగా
మారింది.
సినీపరిశ్రమలో హీరోల నుంచి జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల వరకూ వారిదొక ప్రత్యేక
ప్రపంచం. గ్లామర్, ప్రజాదరణకు పర్యాయపదంగా మారిన ఈ రంగంలో చాలామంది విలువలకు కట్టుబడి
ఉన్నా.. యువతరంలో దాదాపు 70% మంది రాత్రుళ్లు పబ్బులకు వెళ్తున్నారు. మరింత మత్తు,
కిక్కు కోసం మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారు. ముంబయి, చెన్నై నుంచి వచ్చిన మోడళ్లతో
మేమూ తక్కువ కాదని నిరూపించుకునేందుకు వీటిని వినియోగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాల వినియోగం ఒక స్థాయి దాటిపోయిందని నైజీరియన్ల ద్వారా
పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. చిత్రపరిశ్రమతో సంబంధం ఉన్న వారిలో నలభైశాతం
మందిమాదకద్రవ్యాలు వినియోగించడంతో పాటు వీటిని మరింతగా వ్యాప్తి చేసేందుకు నైజీరియన్లను
ఆశ్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారి వద్దనుంచి కిలో లెక్కన కొంటున్నారు. దీనికంతటికీ
ప్రధాన సూత్రధారి దక్షిణాఫ్రికాలో ఉన్న డ్రగ్స్ వ్యాపారి ఎథిల్ అని అనుమానిస్తున్నారు.

వ్యభిచారం కేసులో సైరాభాను, జ్యోతి అరెస్ట్
డ్రగ్స్ వ్యవహారం పుట్టిస్తున్న ప్రకంపనల తాకిడికే అతలాకుతలం అవుతున్న టాలీవుడ్‌లో సెక్స్ రాకెట్ బయటపడడడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లవుతోంది. వ్యభిచారం కేసులో జ్యోతి, సైరా భానులతో పాటు నీలమణి అనే మరో వర్ధమాన నటి అరెస్ట్ కావడంతో తెలుగు చిత్రసీమ గౌరవం మంటగలిసిపోతోంది.
హైద్రాబాద్‌లోని కుందన్‌బాగ్ అనే ఓ ఖరీదైన ప్రాతంలోని ఓ పోష్ అపార్ట్‌మెంట్‌లో ప్రముఖ నటీమణులు జ్యోతి, సైరాభానులను పంజాగుట్ట పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్ట్ చేసారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నది స్వయంగా నిర్మాత కావడం పరిశ్రమ వర్గాలు తలెత్తుకోలేకుండా చేస్తున్నది. ‘ఎల్ బోర్డ్’, ‘జాదూగాళ్లు’ వంటి చిత్రాలను నిర్మించిన జువ్వలరాజు అనే నిర్మాత నిర్వహిస్తున్న వ్యభిచారగృహంపై సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపుదాడి చేసి, నిర్వాహకుడితోపాటు వ్యభిచారానికి పాల్పడుతూ పట్టుబడిన జ్యోతి, సైరాభానులను అరెస్టు చేసారు. వీరితోపాటు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన విదేశీ యువతి కూడా పోలీసులకు పట్టుబడింది.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొంది విజయం సాధించిన ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన జ్యోతి, పవన్‌కళ్యాణ్‌తో ‘గుడుంబా శంకర్’, సుమంత్‌తో ‘గౌరి’, శ్రీకాంత్ నూరవ చిత్రం ‘మహాత్మ’తోపాటు ‘హంగామా’, ‘ఎవడిగోల వాడిదే’, ‘హాసిని’, ‘రాంబాబుగాడి పెళ్లాం’ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈమె శ్రీకాంత్ నటిస్తున్న ‘రంగా ది దొంగ’ మరికొన్ని చిత్రాలలోనూ నటిస్తోంది. ఇక టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన సైరాభాను కూడా ‘బొమ్మరిల్లు’ వంటి పెద్ద చిత్రాల తోపాటు, ‘100 కోట్లు, అనగనగా ఒక రోజు’, ‘అరణ్యం’, ‘టిక్..టిక్..టిక్’ వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది.
|