బుల్లితెరపై నవశకానికి నాంది పలికిన ఏక్తా కపూర్ సినిమా రంగంలోనూ సంచలన విజయాలు సాధించింది. టీవీ
సీరియళ్ళలో కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏక్తా, సినిమాకు మాత్రం మసాలా జోడించడం విశేషం.
విజయవంతమైన ఈ ఫార్మూలానే నేటికీ ఆమె కొనసాగిస్తోంది. బాలాజీ టెలీ ఫిలింస్ పేరిట తీసిన సీరియళ్ళు అనేకం
విజయఢంకా మోగించాయి. ఆ సీరియళ్ళు వచ్చే సమయంలో మహిళలు టీవీకి అతుక్కుపోతారంటే అతిశయోక్తి కాదు.
తాజాగా ఏక్తా తన డర్టీ పిక్చర్‌తో వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె పై ప్రత్యేక కథనం....
అత్తా-కోడళ్ళ మధ్య జరిగే హాట్ హాట్ గొడవలను సరికొత్త విధంగా చూపించిన ఏక్తా కపూర్‌ను దేశంలోని మహిళా
ప్రేక్షకులు విపరీతంగా మెచ్చుకున్నారు. మకుటం లేని సీరియల్ నిర్మాతగా కీర్తించారు. రాగిని ఎమ్.ఎమ్.ఎస్, వంటి
చిత్రాలు తీయడంతో మహిళలలు కుటుంబసమేతంగా థియేటర్‌కి తరలి వెళ్లారు. తీరా చిత్రం ప్రారంభమయ్యాక చిత్రం తీరు
చూసి ఇది నిజంగా ఏక్తా తీసిన సినిమానా అని ఆశ్చర్యపోయారు.
ఏక్తా కపూర్...
ఏక్తా కపూర్ ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు జితేంద్ర కూతురు. బాలీవుడ్ యువ నటుడు తుషార్ కపూర్ సోదరి.
సాధారణంగా సినిమా తారల సంతానం హీరో, హీరోయిన్‌లు అవ్వాలనుకుంటారు. కాని ఏక్తా కపూర్ మాత్రం వాణిజ్య
విలువలున్న టీవి సీరియల్స్‌ను, చిత్రాలను నిర్మించి మంచి పేరు సంపాదించారు . బాలాజీ టెలిఫిలిమ్స్ అనే నిర్మాణ
సంస్థను ప్రారంభించి ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది.
చరిత్ర సృష్టించిన టీవి సీరియల్...
బాలాజీ టెలిఫిలిమ్స్ నిర్మించిన ‘క్యూకీ సాస్ భీ కభీ బహూతీ’ టీవీ సీరియల్‌లో దేశ వ్యాప్తంగా ప్రసారం అయ్యి సంచలన
విజయం సాధించింది. ఈ సీరియల్‌ని ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మించారు. 2000లో ప్రారంభమయిన ఈ
సీరియల్ 1830 ఎపిసోడ్లు నిరంతరాయంగా ప్రసారమై భారతీయ టెలివిజన్ చరిత్రలోనే ఎక్కువకాలం ప్రసారమైన
సీరియల్‌గా రికార్డు సృష్టించింది. అంతే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యంత ప్రేక్షకాదరణ సంపాదించింది. దాదాపు 5
సంవత్సరాలు నిరంతరాయంగా అత్యధిక టీఆర్‌పీ కలిగిన సీరియల్ కూడా ఇదే కావడం విశేషం.
ఈ సీరియల్ ప్రసారమయ్యే సమయంలో మహిళలు టీవీ సెట్లకు అతుక్కుపోయేవారు. భారతదేశంలోని వివిధ
భాషలలోనూ ఈ సీరియల్ ప్రేక్షకులను అలరించింది. దీని పాపులారిటి విదేశాలకు కూడా పాకింది. శ్రీలంక, అఫ్ఘానిస్థాన్,
పాకిస్తాన్‌లో కూడా ప్రసారం చేయగా అక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణను సంపాదించింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త
నటులను, సరికొత్త మలుపులు పరిచయం చేస్తూ తాజాదనాన్ని కాపాడటంతో అయిదు సంవత్సరాలు చూసినా ఈ
సీరియల్ కు ప్రేక్షకుల ఆధరణ మాత్రం తగ్గలేదట. అప్పట్లోనే ఇలాంటి క్రియేటీవ్ ఆలోచనలతో మంచి గుర్తింపు
సంపాదించింది ఏక్తా. ఆమె సీరియల్స్ అనేకం ‘కె’ అక్షరంతో ప్రారంభవడం విశేషం.
టీవీకి అతుక్కుపోయేలా....
రోజంతా కష్టపడి ఇంటికొచ్చి భర్తను పట్టించుకోకుండా భార్య టీవీకే అతుక్కుని ఉందంటే ఆమె ఏక్తా కపూర్ నిర్మించిన ఏదో
ఒక సీర్‌యల్‌ను చూస్తుందని భర్త అర్ధం చేసుకునేవాడు. కొంత సమయం వార్తలు లేదా క్రికెట్ మ్యాచ్ చూద్దాం అన్నా
వీలవ్వక అనేక మంది పురుషులు ఇబ్బంది పడేవారు. చివరికి వాళ్లు కూడా సీరియల్ చూడటం ప్రారంభించేవారు. ఇలా
పురుషులు కూడా ఏక్తా సీరియల్స్‌కు అభిమానులయ్యేవారు. ఇంతలా మహిళా అభిమానులను ఏక్తా ఎలా
సంపాదించిందో తెలుసా?.. ప్రతికుటుంబంలో జరిగే చిన్న విషయాలను గమనించి వాటినే సీరియల్స్ రూపంలో నిర్మించేది.
ఏక్తా సీరియల్స్‌లో అప్పుడప్పుడు కొందరు సినిమా స్టార్‌లు అతిథి పాత్రల్లో కనిపించడం విశేషం.ఇదే ఫార్ములాతో హమ్
పాంచ్, కహానీ ఘర్ ఘర్‌కీ, కైసా యే ప్యార్ హే, కసౌటీ జిందగీకీ, కితినీ మోహబ్బత్ హై, నిర్మించింది. ప్రస్తుతం ఏక్తా
నిర్మించిన పవిత్ర రిష్తా, ప్యార్ కీ యే ఏక్ కహానీ, బడే అచ్ఛే లగతే హే, పరిచయ్ సీరియల్‌లు విజయవంతంగా
ప్రసారమవుతున్నాయి.
ప్రేక్షకుడికి నిజంగా సినిమాలో కావాల్సినవి...
సీరియల్స్‌ను కుటుంబం మోత్తం కలిసి చూసే విధంగా నిర్మించే ఏక్తా పూర్ సినిమాలను మాత్రం కేవలం ‘పెద్ద’లు చూసే
విధంగా నిర్మిస్తోంది. తనదైన శైలిలో చిత్రనిర్మాణాలు చేపట్టి వాటికి కొంచెం వివాదాలను జోడించి చివరికి ప్రేక్షకుడిని మాత్రం
థియేటర్‌కి రప్పించడంలో విజయం సాధించింది. వన్స్ ఆపాన్ అ టైమ్ ఇన్ ముంబె,ైషోర్ ఇన్ ది సిటి వంటి వైవిధ్య కథా
చిత్రాలను నిర్మించిన ఏక్తా తరువాత వివాదాలతో కూడుకున్న రాగినీ ఎమ్.ఎమ్.ఎస్., లవ్ సెక్స్ ధోఖా వంటి వివాదాస్పద
చిత్రాలను నిర్మించింది. ఏక్తాను నమ్మి థియేటర్లకు వెళ్లిన మహిళా ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాలను చూసి కంగుతిన్నారట.
అయితే ఈ వివాదాలేవీ ఏక్తా పట్టించుకోవడం లేదని వినికిడి.
ఇలా తీస్తే ప్రేక్షకులు చూస్తారట...
ఏక్తా కపూర్ నిర్మాతగా చేపట్టిన ప్రాజెక్ట్‌లన్నీ వాణిజ్య పరంగా పెద్ద విజయం సాధించాయి. ది డర్టీ పిక్చర్ చిత్రం నిర్మాణ
సమయంలోనే అడ్వాన్స్ రూపంలో దాదాపు రూ.10 కోట్ల వ్యాపారాన్ని సాధించిందంటే ఏక్తా ఏ విధంగా చిత్రాలను
ప్రమోట్‌చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తన ప్రతి చిత్రంలో కొన్ని రసవత్తరమైన సన్నివేశాలు ఉండేటట్లు జాగ్రత్త పడుతుంది.
సోదరుడితో చిత్రం...
ఏక్తా కపూర్ నిర్మాతగా తన సోదరుడు తుషార్ కపూర్‌తో 2005లో ‘క్యా కూల్ హె హమ్’ అనే చిత్రాన్ని నిర్మించారు. రితేష్
దేశ్‌ముఖ్ ఈ చిత్రంలో మరో కథానాయకుడు. ఈ చిత్రం సంచలన విజయం సాధించి 2005లో అత్యధిక కలెక్షన్ రాబట్టింది.
నిర్మాతగా పలు చిత్రాలు...
కుటుంబ కథా సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఏక్తా.. 2001లో బాలీవుడ్ కథానాయకుడు గోవిందాతో ‘క్యోంకీ..మై జూట్
నహీ బోల్తా చిత్రాన్ని నిర్మించింది. తరువాత కుచ్‌తో హే, కృష్ణాకాటేజ్, కోయి అప్సా, క్యా కూల్ హె హమ్ చిత్రాలను
నిర్మించింది. అంతే కాకుండా షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా, మిషన్ ఇస్తాంబుల్ తదితర చిత్రాలకు సహ నిర్మాత.
డర్టీ వివాదం...
అలనాటి దక్షిణాది ఐటం గర్ల్ సిల్క్ స్మిత జీవితకథను ఆధారం చేసుకుని ‘ది డర్టీ పిక్చర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది ఏక్తా
కపూర్. దాంతో సిల్క్ స్మిత కథను చిత్రంగా తీయడమేంటని కొందరు ఆశ్చర్యపోయారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం
పోస్టర్ సంచలనం సృష్టించింది. ఇది నిజంగా ‘డర్టీ పిక్చర్’ అని బాలీవుడ్ వర్గాలు పేర్కోంటున్నాయి. ఇదంతా పట్టించుకోని
ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రం విడుదలకు వేచి చూస్తున్నారు.
ప్రోఫైల్:
పూర్తి పేరు : ఏక్తా జీతేంద్ర కపూర్
పుట్టిన తేది : జూన్ 7, 1975
వృత్తి : టీవి, చలన చిత్ర నిర్మాత
డైరక్టర్, బాలాజి టెలీఫిలివ్గ్ము
జాయింట్ మ్యానేజింగ్ డైరక్టర్
తల్లిదండ్రులు : జితేంద్ర, శోభా కపూర్
సోదరుడు : తుషార్ కపూర్