మసాలా
 
 
 
 
బాలీవుడ్ లో ఇంగ్లీషు భామల హవా
'ఎంతసేపూ చూసిన ముఖాలనే చూసి చూసి బోర్ కొడుతోంది' అని ప్రేక్షకులు అంటున్నారో లేదో కానీ, బాలీవుడ్ దర్శకులు మాత్రం అలాగే ఫీలవుతున్నట్టున్నారు. అందుకే, కరీనాకపూర్, కత్రినాకైఫ్, విద్యాబాలన్, ప్రియాంకా చోప్రాల కంటే విదేశీముద్దు గుమ్మలకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఈ మధ్య బాలీవుడ్ సినిమాలలో వీళ్ల హవా పెరుగుతోంది....

జెస్లీ మోంటారియో : రెండో సినిమా అయిన 'ఆల్వేస్ కబీ కబీ' కోసం ఈ ముద్దుగుమ్మ ఓ.. తెగ హార్డ్‌వర్క్ చేస్తోంది. బ్రెజిల్‌కు చెందిన జెస్లీ ఇదివరకు 'లవ్ ఆజ్‌కల్'లో నటించింది. విదేశీ కావడంతో భాషా సమస్య ఎదురైంది. అందుకని ఆమె నటించిన సన్నివేశాలలో తక్కువ సంభాషణలను పెట్టారట డైరెక్టర్. డ్యాన్స్ కోసం కూడా సింపుల్ స్టెప్స్‌ను డిజైన్ చేశారు ఈ అమ్మడి కోసం.

నర్గిస్ ఫక్రి : చెక్ రిపబ్లిక్ సంతతికి చెందిన నర్గిస్ పాకిస్తాన్‌లో పెరిగి అమెరికాలో మోడల్ అయ్యింది. రణ్‌బీర్‌కపూర్ నటించిన 'రాక్‌స్టార్'లో నర్గిస్‌కు అవకాశం వచ్చింది. బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు పొందిన ఈమె మరిన్ని కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తోందట.

బార్బరా మోరీ : హృతిక్‌రోషన్ నటించిన 'కైట్స్' సినిమాలో తళుక్కున మెరిసింది బార్బరా. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసులు రాల్చకపోవడంతో బార్బరాకు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఉరుగ్వేలో మంచి మోడల్‌గా పేరు తెచ్చుకున్న ఈమె పలు సబ్బుల ప్రకటనల్లో నటించింది.

క్యాథరిన్ లోపెజ్ : రొమాంటిక్ లుక్స్‌తో కవ్వించే ఈ చిన్నది త్వరలో రానున్న 'బిందీ బజార్'లో ఆకట్టుకోనుంది. కేవలం బాలీవుడ్‌లో నటించడానికే ఆరిజోనాకు చెందిన లోపెజ్ మూటాముల్లె సర్దుకుని ముంబయికి వచ్చేసింది. ఇక, ముంబయిలోనే ఉండిపోతుందట. ఆంటోనియా

బెర్నాత్ : సుభాష్‌ఘయ్ సినిమా 'క్రిష్ణా: ద వారియర్ పొయట్'లో నటించిన తొలి ఆంగ్లేయ నటిగా పేరు తెచ్చుకుంది. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ఏరికోరి ఆమెను ఎంపిక చేశారు దర్శకులు. ఇదివరకు పలు టీవీ కార్యక్రమాల్లో కూడా నటించింది ఆంటోనియా.