ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన ‘ఈటీవి2’ రవి తల్లిదండ్రులకు చిత్ర పరిశ్రమలోని పలువురు దాతలు అందించిన దాదాపు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిలింఛాంబర్లో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ డి.రామానాయుడు చేతుల మీదుగా ఫిక్డ్స్ డిపాజిట్ల బాండులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇవివి సత్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, డాక్టర్ డి.రామానాయుడు, సంగిశెట్టి దశరథ, హరిగోపాలకృష్ణమూర్తిలు పాల్గొన్నారు./p>
ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి అధ్యక్షులు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ- ‘యువకుడైన రవి ఆకస్మికంగా మరణించడం దురదృష్ణకరం. తల్లిదండ్రులకు ఆధారమైన కుమారుడు ఆకస్మికంగా మృతి చెందితే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి సహచర మిత్రులు ఇలా విరాళాలు పోగుచేసి వారిని ఆదుకోవడం అభినందించదగ్గ విషయం. రవిని మళ్ళీ పాత్రికేయునిగానే పుట్టించమని దేవుడిని వేడుకుంటున్నాను. పరిరక్షణ సమితి తరఫున రవి కుటుంబానికి రూ.10లక్షల రూపాయలు, వ్యక్తిగతంగా నేను ఒక లక్ష రూపాయలు ఇవ్వనున్నాను‘ అని అన్నారు.
డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ- ‘మనలో ఒకడైన రవి చిన్న వయస్సులోనే ఆకస్మికంగా మరణించడం బాధాకరం. అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి వారి సహచర పాత్రికేయులు చేసిన ప్రయత్నం అభినందించదగ్గది. సినిమా పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకోవడానికి అందరూ సిద్ధంగా వుంటారని చెప్పడానికి ఇది ఒక ఉదామరణ. మున్ముందు వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా వున్నాము‘ అన్నారు.
ఇవివి సత్యనారాయణ మాట్లాడుతూ- ‘అందరికీ ఎంతో సన్నిహితంగావుంటూ, వివాదరహితుడిగా వుండే రవి మరణించడం బాధాకరం. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కృషి చేసిన వారి సహచర పాత్రికేయులకు అభినందనలు’ అన్నారు.
ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘు మాట్లాడుతూ- ‘వివాదరహితుడిగా వుంటూ, తన పనితాను చేసుకుంటూ వెళ్ళే రవి మరణించడం మాకందరికీ తీరని లోటు. వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి మేము చేసిన ప్రయత్నానికి సహకరించిన సినిమా పరిశ్రమలోని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు.
టీవి9 పాత్రికేయుడు రవిచంద్ర వందన సమర్పణ చేశారు.
|