మసాలా
 
 
 
 
నేనూ తపన పడుతున్నా
స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌తో హాలీవుడ్‌ ప్రవేశం చేసిన ఫ్రిదా పింటో కెరీర్‌ మంచి ఊపుమీద నడుస్తోంది. ముంబారులో పుట్టిన ఈ ముద్దుగుమ్మ తొలి ప్రయత్నం ప్రపంచవాప్త గుర్తింపు తీసుకొచ్చింది. ఆస్కార్‌ పంట పండించింది. దీంతో హాలీవుడ్‌లోని చిత్ర ప్రముఖుల దృష్టిలో పడింది. యూ విల్‌ మీట్‌ ఏ టాల్‌ డార్క్‌ స్ట్రేంజర్‌, మిరాలి, రైజ్‌ ఆఫ్‌ ద ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌, ఇమ్మోర్టల్స్‌...మొదలైన అంతర్జాతీయ చిత్రాల్లో నటించింది. మరో రెండు ఆంగ్ల చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సందర్భంగా పలు సంగతులు ఇలా చెప్పుకొస్తోంది...

* పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో అవకాశాలు వచ్చాయి. ఇదంతా కేవలం నా ప్రతిభ అనుకోను. అదృష్టం పాలు ఎక్కువ. ప్రస్తుతం త్రిష్ట, బ్లాక్‌గోల్డ్‌ చిత్రాలు చేస్తున్నా. ఈ రెండూ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. నా సినీ ప్రయాణం ఇంత బాగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. చాలా సంతోషంగా ఉన్నాను.

* ధూమ్‌-3 కోసం యశ్‌రాజ్‌ సంస్థ సంప్రదించిందన్న వార్తల్లో నిజం లేదు. అలా అని భారతీయ చిత్రాల్లో చేయడం ఇష్టం లేదని కాదు. ఇక్కడ ప్రతిభ గల దర్శకనిర్మాతలెందరో ఉన్నారు. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలి. అలాగే బిజోరు నంబియార్‌, విశాల్‌ భరద్వాజ్‌, అశుతోష్‌ గోవార్కర్‌...వీరంతా తమదైన శైలిలో చిత్రాల్ని తెరకెక్కిస్తారు. వారి చిత్రాల్లో కనిపించాలని నేనూ తపన పడుతున్నా.

* స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌...అందులోని నటులందరికీ గుర్తింపును తీసుకొచ్చింది. అది అలాంటి ఇలాంటి గుర్తింపు కాదు. ఎంతోమంది హాలీవుడ్‌ దర్శకులు మా గురించి వాకబ్‌ చేశారు. ఇక ఇప్పుడంతా ఆ అవకాశాల్ని సరిగ్గా వినియోగిం చటంపైనే దృష్టి పెడుతున్నా.

* ఇక బాలీవుడ్‌లో అభరు డియోల్‌ అంటే ఏదో తెలియని ఆసక్తి ఉంది. కె.కె.మీనన్‌, మనోజ్‌ బాజ్‌పారు వంటి ప్రతిభావంతులతో చేయాలని నేనూ కోరుకుంటున్నా. సినిమా ఒప్పుకునే ముందు ఆ చిత్ర కథ నచ్చాలి. స్క్రిప్ట్‌లో నా పరిధి ఎంతమేరకో ఆలోచిస్తా.

*ఇప్పటివరకూ చేసిన చిత్రాలన్నీ సంతృప్తినిచ్చాయి. వీటి ద్వారా ఎంతో నేర్చుకున్నా. ఒక్కో చిత్రంలో నటించిన అనుభవం, మరో చిత్రానికి పనికివచ్చింది. దర్శకుడు ఊడీ అలెన్‌ ఎంతగానో సహకరించారు. సినిమాలో సంతకం చేసినప్పుడే స్క్రిప్టు చేతికి ఇస్తారు. కథలో అవసరాన్ని బట్టి సెట్‌లో మీ పాత్ర తాలూకూ మార్పుచేర్పులూ చేస్తుంటానని...అందులో ఒక నోట్‌ కూడా చేర్చారు.