మసాలా
 
 
 
 
‘చీర్‌లీడర్’కు బాలీవుడ్ ఆఫర్!
‘చీర్‌గర్ల్స్ అంటే అందరికీ లోకువ. చాలా మంది క్రికెటర్లు మాతో అసభ్యంగా ప్రవర్తించారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన దక్షిణాఫ్రికా చీర్‌లీడర్ గాబ్రియెలా పాస్‌క్వాలొటోకు అనూహ్యం ప్రచారం లభిస్తోంది. ఆమెకు ఒక హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం లభించినట్లు సమాచారం. దీంతో పాటు అక్టోబరులో ఢిల్లీలో జరిగే ఇండియా గ్రాండ్‌ప్రికి కూడా ఆహ్వానం అందినట్లు దక్షిణాఫ్రికా మీడియా వెల్లడించింది. ఐపీఎల్‌కు సంబంధించి 22 ఏళ్ల గాబ్రియెలా వ్యాఖ్యలు సంచలనం రేపటంతో ఆమె ఒక్కసారిగా హాట్ సెలబ్రిటీగా మారిపోయింది.

అమెరికాకు చెందిన ఎన్‌బీసీ చానల్, ఆస్ట్రేలియాకు చెందిన అగ్రశ్రేణి రేడియో డీజీలు తమకు ఇంటర్వ్యూ కావాలంటూ గాబ్రియెలాను కోరాయి. ఐపీఎల్-4 లో ముంబై ఇండియన్స్ జట్టుకు చీర్‌గర్ల్‌గా పని చేసిన పాస్‌క్వాలొటో తనకు ఎదురైన అనుభవాల గురించి బ్లాగ్‌లో రాసి సంచలనం సృష్టించింది. ‘మేం నడుస్తుంటే అందరూ మమ్మల్ని పైనుంచి కింది వరకు తీక్షణంగా చూస్తారు. కామెంట్స్ కూడా విసురుతారు. మ్యాచ్ తర్వాత జరిగే పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి. వీఐపీ రూముల్లో జరిగే తంతు మరో రకంగా ఉంటుంది’ అంటూ వ్యాఖ్యలు చేసిన చీర్‌గర్ల్... స్మిత్, బ్లిజార్డ్, క్రిస్టియాన్ తదితర ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయితే తాను సచిన్, ధోని సహా ఎంతో మంది భారత క్రికెటర్లను కలిసినా... వారంతా మర్యాదపూర్వకంగా వ్యవహరించారని దక్షిణాఫ్రికా సుందరి మన ఆటగాళ్లకు క్లీన్‌చిట్ ఇచ్చింది.