తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మంగళవారం రాత్రి 11.30 ప్రాంతంలో గుండెపోటుతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా వేమూరు మండలం రావికంపాడు ఆయన స్వగ్రామం. గుమ్మడి 1927 జులై 9న జన్మించారు. ఆయనకు 83 ఏళ్లు. గుమ్మడికి ఏడుగురు సంతానం. వీరిలో ఐదుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అంతా విదేశాల్లో ఉంటున్నారు. గుమ్మడి 1942లో తొలిసారిగా ఒక నాటకం కోసం ముఖానికి రంగు వేసుకొన్నారు. అందులో ఆయన వృద్ధుడిగా కనిపించారు.
తిమ్మరుసు నటనకు జాతీయ అవార్డు :
కులదైవం, మా ఇంటి మహాలక్ష్మి, మహా మంత్రి తిమ్మరుసు, కులగోత్రాలు తదితర చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఆయన చివరి చిత్రం
శ్రీకాశీనాయన చరిత్ర. మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి ఆయన జాతీయ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం అందుకొన్నారు. 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నుంచి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు పొందారు.
ఆరు దశాబ్దాలపాటు సేవలు :
1950 నుంచి ఆరు దశాబ్దాలపాటు గుమ్మడి సినీ రంగంలో సేవలందించారు. ఆయన తొలి చిత్రం అదృష్టదీప్తుడు. పౌరాణికాలు, సాంఘికాలు ఇలా అన్ని రకాల
సినిమాల్లో అద్వితీయమైన నటన ప్రదర్శించారు. దాదాపు ఐదు వందల చిత్రాల్లో నటించిన ఆయన, సాత్వికాభినయానికి పెట్టింది పేరు. నందమూరి తారక
రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి లాంటి గొప్ప నటులతో గుమ్మడి తెర పంచుకొన్నారు. మాయాబజార్ చిత్రంలో బలరాముడి
పాత్రలో ఆయన ప్రేక్షకులను మెప్పించారు. రంగుల్లో త్వరలో విడుదల కానున్న మాయాబజార్ చిత్రాన్ని గుమ్మడి ఇటీవలే ప్రత్యేకంగా తిలకించారు.
నటుడికి వాచకం ప్రధాన అర్హతని నమ్మే నటుడు గుమ్మడి. 'ఆయనకిద్దరు' సినిమా చిత్రీకరణ అనంతరం ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దీంతో సరిగా
మాట్లాడలేకపోయారు. ఈ కారణంగా ఆ సినిమాలో వేరే వాళ్లతో ఆయనకు డబ్బింగ్ చెప్పించడంతో, ఆ తర్వాత ఆయన నటించడం ఆపేశారు. శ్రీ కాశీనాయన
చరిత్రలో తన పాత్ర తన వయసుకు తగ్గట్టు ఉంటుందని, స్వరానికి కూడా సరిపోతుందని చెప్పడంతో చేశారు. గుమ్మడికి మొదటి నుంచి వయసుకు మించిన
పాత్రలు రావడం, వాటిల్లో ఆయన ఒదిగిపోవడంతో, అలాంటి పాత్రలంటేనే ప్రేక్షకులకు గుమ్మడి పేరు గుర్తుకు వచ్చేది. గుమ్మడి 'జైవీర భేతాళ' చిత్రంలో
కథానాయకుడిగా నటించారు. జమున హీరోయిన్. ఐతే ఈ సినిమా విడుదల కాలేదు.
1989లో తెలుగు యూనివర్సిటీ గుమ్మడికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరితోనూ ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఐతే,
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన 'శ్లాబ్' విధానాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సినిమా పరిశ్రమను కుదేలు చేస్తుందని ఆందోళన
వ్యక్తంచేశారు. తెలుగు సినిమా కథల్లో సృజనాత్మకత తగ్గిపోయి, స్టార్ ఇమేజ్‌కే పట్టంగట్టే పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు.
|