మసాలా
 
 
 
 
'ఆయన’ను డెరైక్ట్ చేయడం సవాలే!
హిట్‌పెయిర్‌గా పేరుతెచ్చుకున్న ధర్మేంద్ర, హేమమాలిని దంపతులు నటించిన ఎన్నో సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హేమమాలిని దర్శకత్వంలో ధర్మేంద్ర నటిస్తున్నారు. ఆయన నటించే సినిమాకు దర్శకత్వం వహించడం తనకు సవాల్‌గా మారిందని హేమ అన్నారు. ‘టెల్ మీ ఖుదా’ అనే ఈ సినిమాలో వీరి ముద్దుల కూతురు ఈశా డియోల్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘ప్రతీ పాత్రలో జీవించే ధర్మేంద్రకు సినీ పాఠాలు చెప్పడం కష్టం. ‘టెల్ మీ ఖుదా’లో రిషీ కపూర్, వినోద్ ఖన్నా, ఫరూఖ్ షేక్‌వంటి హేమాహేమీలు ఉన్నా ధర్మేంద్రను డెరైక్ట్ చేయడం సవాలే. షాట్‌కు ముందే ఆ సీన్ గురించి ఆయన చాలా ప్రశ్నలు అడిగేవారు.

అందుకే నేను ముందుగానే అన్నింటినీ బాగా చదువుకునేదాన్ని. పూర్తి నిబద్ధతతో పనిచేసే నటుడాయన. ఒక్క షాట్ కూడా రద్దు కాకుండా జాగ్రత్త తీసుకుంటారు’ అంటూ భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘టెల్ మీ ఖుదా’లో నల్లకోటు, భారీ వెంట్రుకలు, చేతులపై టాటూలతో కనిపించే గోవా డాన్‌గా ధర్మేంద్రను భిన్నంగా చూపించారు. ధర్మేంద్ర ఇలా కనిపించడం ఇదే మొదటిసారని హేమ చెప్పారు. ఈ వేషధారణకు అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయని ఈ 62 ఏళ్ల సీనియర్ నటీమణి తెలిపింది.

ఈ నెల 27న విడుదలయ్యే ‘టెల్ మీ ఖుదా’ ప్రచారం కోసం శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హేమ మాట్లాడుతూ ఈ సంగతులన్నీ వివరించారు. షారుఖ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రా.వన్ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రా.వన్‌కు పోటీగా భారీ ప్రచారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారా అన్న ప్రశ్నకు అదేమీ లేదని బదులిచ్చారు. ‘రా.వన్‌ను రూ.150 కోట్లతో నిర్మించారు. మేం అంత ఖర్చు చేయలేదు. ప్రచారం కూడా భారీగా ఏమీ ఉండదు’ అని వివరించారు. 1992లో విడుదలైన దిల్ ఆస్నా హై హేమమాలినికి దర్శకురాలిగా తొలిచిత్రం.