Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
మత్తులో యువ హీరోలు!

      నగరం కేంద్రంగా కొనసాగుతున్న మత్తుమందుల రాకెట్ తీగను లాగే కొద్దీ చలనచిత్ర పరిశ్రమలోని కొందరి డొంకలు కదులుతున్నాయి. నలుగురు యవహీరోలు ఈ మత్తుమందుల వినియోగం, సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల విజయవంతమైన ఓ చిత్రంలో నటించిన యువహీరో మత్తుమందు సరఫరాదారులతో మాట్లాడుతూ పోలీసుల దృష్టిలో పడగా... ఆ హీరో కుటుంబ హోదాను పరిగణనలోకి తీసుకుని గట్టిగా హెచ్చరించి వదిలేసినట్టు తెలిసింది. మిగిలిన వారికి మత్తుమందుల వినియోగం, సరఫరాకు సంబంధించి సరైన ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

నగరంలో కొకైన్, ఎల్ఎస్ డీ, ఎక్టసీ వంటి మత్తుమందుల వినియోగంలో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులే అధికంగా ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొద్ది రోజుల క్రితం బంజారాహిల్స్లో డ్రగ్స్ తో పట్టుబడిన ఇద్దరు విదేశీయులు ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు అంతటితో వదలకుండా డ్రగ్స్ రాకెట్ పై దృష్టి సారిచడంతో సినీ, రాజకీయరంగానికి చెందిన వ్యక్తుల ప్రమేయం బయటపడింది. అయితే... పూర్తిస్థాయి ఆధారాలు లేకపోవడంతో వీటిని సేకరించేందుకు రెండు ప్రత్యేక బృందాలను హైదరాబాద్ పోలీసు విభాగం నియమించింది. పదిహేను రోజులుగా ఈ రెండు బృందాలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లలోని కొన్ని పబ్బులు, బార్లకు వెళ్లి సమాచారాన్ని సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో పాటు కొకైన్, ఎల్ఎస్ డీలు విక్రయిస్తున్న వారిని పట్టుకుని 200 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పబ్ లు, బార్లు వద్ద వారు సేకరించిన సమాచారం ఆధారంగా నలుగురు యువహీరోలు, ఇద్దరు యువ హీరోయిన్లు, ముంబైలో నివాసముంటున్న ఓ హీరోయిన్ ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నారు. షూటింగులు పూర్తికాగానే పబ్ లకు వచ్చి కొకైన్ మత్తులో మునిగిపోతున్నట్టు గమనించారు. రాత్రి పదకొండు గంటల నుంచి అర్థరాత్రి దాటేంత వరకూ వీరు పబ్ లలో ఉండి మత్తుమందు తీసుకున్నాక ఇళ్లకు వెళ్తున్నారు. నలుగురు యువహీరోల్లో ముగ్గురు వారాంతాల్లో రెగ్యులర్ గా కలుసుకుంటున్నారు. వీరే మరికొందరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక యువ హీరోయిన్లు ఉత్తరాదివారు కావడం, పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో సరైన ఆధారాలు లభించలేదు.

హెచ్చరికలతో సరి!
సినిమా పరిశ్రమలో యువహీరోలు, హీరోయిన్లు, హీరోల సోదరులు డ్రగ్స్ వినియోగిస్తున్న జాబితాలో ఉన్నారు. వీరికి హైదరాబాద్ లో నివాసముంటున్న నైజీరియన్లు, ఉగాండా దేశస్థులు అత్యంత రహస్యంగా సరఫరా చేస్తున్నారు. గత నెలలో ఇద్దరు ఉగాండా దేశస్థులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేయడంతో డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన తీగ పోలీసులకు దొరికింది. దీని ఆధారంగా పరిశోధన కొనసాగిస్తే చిత్ర పరిశ్రమలో రెండువందలమందికి పైగా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు తెలిసింది. వీరిని అరెస్ట్ చేసేందుకు చట్టపరంగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చట్టప్రకారం పట్టుకోవాలంటే వారి వద్ద మత్తుమందు ఉండాలి లేదా కొంటుండాలి లేదా వారి శరీరంలో మత్తు మందు ఉండాలి. ఇలా అయితేనే అరెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఇటీవల పోలీసుల నిఘా పెరగడంతో మరింత రహస్యంగా డ్రగ్స్ ను వారు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పక్కా ఆధారాలను సేకరించడం పోలీసులకు కొంత కష్టంగానే ఉంది. దీంతో సరఫరా దారులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఫోన్ నంబర్లు సేకరించి హెచ్చరించి వదిలేస్తున్నారు. ‘అవతలివారు చాలా ఉన్నత స్థాయి వ్యక్తులు కావడంతో బలమైన సాక్ష్యాధారాలు సేకరిస్తేనే కేసు నిలబడుతుంది. ఆషామాషీగా అరెస్ట్ చేస్తే అంతే సంగతులు, అందుకే గట్టిగా హెచ్చరిస్తున్నాం’ అంటూ ఓ ఉన్నతాధికారి చెప్పారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005