మసాలా
 
 
 
 
విజయ పధంలో హిందీ సినిమాలు
బాలీవుడ్‌లో గతేడాది వంద చిత్రాలు విడుదలైతే ఏడు మాత్రమే వసూళ్లు నమోదు చేసుకున్నాయి. అనేకమంది దర్శకనిర్మాతలకు చేదు ఫలితాలు దక్కాయి. 2011 మాత్రం కలెక్షన్లు కురిపిస్తోంది. రెడీ, సింగం, జిందగీ నా మిలేగీ దోబారా, మర్డర్‌-2, ఢిల్లీ బెల్లీ, యామ్లా పాగల్‌ దీవానా, డబుల్‌ ధమాల్‌, బాడీగార్డ్‌... తదితర చిత్రాలు థియేటర్‌ వద్ద దుమ్మురేపుతున్నాయి.

అజరుదేవ్‌గణ్‌ హీరోగా తెరకెక్కిన 'సింగం' చిత్రం ఆయన సినీ జీవితంలోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నమోదైంది. వంద కోట్ల పైనే వసూళ్లు నమోదుచేసుకుంది. ఈ చిత్రంతోనే కాజల్‌ బాలీవుడ్‌ రంగ ప్రవేశం చేసింది. హృతిక్‌రోషన్‌, కత్రినాకైఫ్‌ నటించిన 'జిందగీ నా మిలేగీ దోబారా' ఇప్పటివరకూ రూ.62 కోట్లు కలెక్ట్‌ చేసింది. వీటి మధ్యలో విడుదలైన 'మర్డర్‌-2' చిత్రం కూడా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించింది. ఇమ్రాన్‌ హష్మీ, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ మధ్య సన్నివేశాలు సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తీసుకొచ్చాయి. అమీర్‌ఖాన్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్‌ నటించిన 'డిల్లీబెల్లీ', సన్నిడియోల్‌ 'యమ్లా పాగల్‌ దివానా' చిత్రాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. 'డబుల్‌ ధమాల్‌' విజయం సంజరుదత్‌లో ఉత్సాహాన్ని నింపింది. ఇటీవలే విడుదలైన 'మేరీ బ్రదర్‌కి దుల్హన్‌' కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. రూ.వందకోట్ల మార్కు దాటుతుందని ట్రేడ్‌ నిపుణులు అంటున్నారు. ప్రేక్షకుడ్ని థియేటర్‌ వరకూ తీసుకురావటంలో బాలీవుడ్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ బాగుంది. సరికొత్త మార్కెటింగ్‌ సూత్రాలు, కొత్త తరహా ప్రచారాలు ఇవన్నీ సినిమాకు ప్లస్‌ అవుతున్నాయి. పిప్లీలైవ్‌, దోబీఘాట్‌, డిల్లీబెల్లీ విజయాలకు అమీర్‌ఖాన్‌ అనుసరించిన వినూత్న ప్రచారాలే కారణం. మంచి కథతో తక్కువ బడ్జెట్‌లో సినిమాను నిర్మించటం, అత్యధిక ప్రింట్లతో విడుదల చేయటం కూడా కలిసొస్తోంది. 'బాడీగార్డ్‌' చిత్రాన్ని 2600 ప్రింట్లతో విడుదల చేశారు. ఇప్పుడు నెలల తరబడి ఆడాల్సిన పనిలేదు. ఒకటి రెండు వారాల్లో మంచి వసూళ్లు నమోదవుతున్నాయి.

సామాజిక విలువలు, దుష్టసంహారం...వంటివి కొన్నాళ్లక్రితం ప్రేక్షకుడి అభిరుచిగా ఉండేవి. కానీ ఈ సమీకరణంలో మార్పు వచ్చింది. ఇప్పుడంతా కట్‌ అండ్‌ పేస్ట్‌ పద్ధతి. మాస్‌ యాక్షన్‌కు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యత దక్కుతోంది. పాశ్చాత్య దేశాల అనుకరణను నేటి యువత ఇష్టపడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొనే బాలీవుడ్‌ కథాంశాలు వస్తున్నాయి. ఇందుకోసం రెడీమెడ్‌ స్టోరీలవైపే ఫిల్మ్‌మేకర్స్‌ మొగ్గుచూపుతున్నారు. వాణిజ్యాంశాల మేలుకలయికగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి తరాన్ని ఆకట్టుకోవాలంటే పాత పంథా పనిచేయదు. ఒకవేళ పాత బంగారాన్ని తీసుకున్నా, దానికి తగిన నగిషీలు చెక్కాల్సిందే. ఆధునిక భాషలో చెప్పాలంటే...కాస్త స్టయిలిష్‌ ప్యాకింగ్‌తో థియేటర్‌ వద్దకు రావాల్సిందే. లోపలున్న వస్తువు ఎంత బాగున్నా, అందుకు తగిన ప్యాకింగ్‌ చేస్తేనే వస్తువుకు మంచి డిమాండ్‌ దక్కుతుంది. ఈ సూత్రాన్నే బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ఔపోసనపట్టారు. యువతరానికి నచ్చే డ్యాన్స్‌, పాటలు చూపుతూనే వైవిధ్యాన్ని కలుపుతున్నారు. ప్రతినాయకుడి పాత్రకు చాలా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంకాస్త ముందుకెళ్లి ఈ విలన్‌రోల్‌ను మరో హీరోతో వేయిస్తున్నారు. ఇటు హీరో, అటు విలన్‌ ఇద్దరూ తమ అభిమాన లోకాన్ని ఆకర్షిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న 'రా.వన్‌', 'డాన్‌ 2', 'అగ్నిపథ్‌' చిత్రాలు ఈ తరహాలో రూపొందాయి. ఈ ట్రెండ్‌ కాస్తా ప్రాంతీయ భాషా చిత్రాలకూ పాకింది. ఇలాంటి ఈక్వేషన్స్‌తో దక్షిణాదివారూ సన్నాహాలు చేస్తున్నారు.