మసాలా
 
 
 
 
మన మార్కెట్ పై హాలీవుడ్ కన్ను
ప్రపంచంలో ఏటా అత్యధికంగా సినిమాలు విడుదలయ్యే దేశం మనదే. సగటున ఏడాదికి వెయ్యి సినిమాలు విడుదలైతే అందులో దాదాపు 500 హిందీ, తెలుగు సినిమాలే. ఇవికాక, ఇంకా తమిళ, మలయాళం, కన్నడం, మరాఠీ, బెంగాలీ, భోజ్‌పురీ... తదితర భాషలన్నిటిలో కలిపి నాలుగైదు వందల సినిమాలు వస్తున్నాయి. 2012 నాటికి మనదేశంలో వినోదరంగం విలువ రూ.6000 కోట్లు దాటుతుందని అంచనా. వీటన్నిటికీ మూలమైనవారు నూటపది కోట్ల మంది ప్రేక్షకులు. ఈ గణాంకాలన్నీ చూస్తే ఏ చిత్ర నిర్మాణ సంస్థకైనా ఆశపుట్టడం సహజం. అందుకే హాలీవుడ్‌ సంస్థలకు మన దేశ మార్కెట్‌ బంగారు బాతులా కనిపిస్తోందిప్పుడు. వార్నర్‌బ్రదర్స్‌, ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌, పారామౌంట్‌ పిక్చర్స్‌, వాల్ట్‌డిస్నీ లాంటి సుప్రసిద్ధ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థలన్నీ మనదేశంపై కన్నేశాయి. ఒకదాని తర్వాత ఒకటిగా మన మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి.

భారతదేశమే...
2008 మే నెలలో వయాకామ్‌ సంస్థ మనదేశంలోని నెట్‌వర్క్‌18తో కలిసి టీవీసీరియళ్లు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 'చిత్ర నిర్మాణ సంస్థలను వూరించే మూడు ప్రధాన మార్కెట్లలో ముఖ్యమైనదీ ఆసియాలోనే అగ్రస్థానంలో నిలిచేదీ భారతదేశమేనంటే అతిశయోక్తికాదు' అన్నారు వయాకామ్‌ సంస్థ అధిపతి టామ్‌ఫ్రెస్టన్‌ ఈ ఒప్పందం కుదుర్చుకునే సందర్భంలో. 'చైనాలో ఏడాదికి 20కన్నా ఎక్కువ విదేశీ చిత్రాలు విడుదలచేసే వీలు లేదు. విదేశీ యానిమేషన్‌ చిత్రాలను విడుదల చేసేందుకే ఒప్పుకోరు' అంటారు వాల్ట్‌డిస్నీ అధినేత ఆండీబర్డ్‌. ఆయన అన్నట్టుగానే మిగతా హాలీవుడ్‌ సంస్థల కన్నా వేగంగా మన మార్కెట్లోకి చొచ్చుకువచ్చింది వాల్ట్‌డిస్నీ. గత రెండేళ్లలో హిందీలో 'రోడ్‌సైడ్‌ రోమియో', 'దో దోనీ చార్‌' చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ తెలుగులోనూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి 'అనగనగా ఒక ధీరుడు' పేరుతో ఫాంటసీ థ్రిల్లర్‌ను రూపొందించింది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలచేసి మార్కెట్‌ చేసుకునేందుకు వీలుగా... అక్కడ కూడా ఆదరణ ఉన్న సిద్ధార్థ, కమలహాసన్‌ కుమార్తె శ్రుతిహాసన్‌లను ఎంచుకోవడంలోనే డిస్నీసంస్థ ముందుచూపు అర్థమవుతుంది.

ఇవేకాదు, 'తారే జమీన్‌ పర్‌' సినిమాతో పాపులర్‌ అయిన కుర్రాడు దర్శీల్‌ సఫారీ ప్రధాన పాత్రలో డిస్నీ సంస్థ నిర్మించిన 'జోక్కోమాన్‌' సినిమా కూడా చిత్రీకరణ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. వచ్చే రెండుమూడేళ్లలో హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో మరో ఆరు సినిమాలను తీసే ప్రణాళికల్లో ఉందీ సంస్థ.

మరో ప్రముఖ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ కూడా 2008లోనే 'సాస్‌ బహు ఔర్‌ సెన్సెక్స్‌' చిత్ర సమర్పణతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తర్వాత అక్షయ్‌కుమార్‌, దీపికా పదుకొనే జంటగా 'చాందినీ చౌక్‌ టు చైనా' చిత్రాన్ని నిర్మించింది. వార్నర్‌బ్రదర్స్‌, రమేష్‌సిప్పీ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ట్రీ ప్రొడక్షన్స్‌ కలిసి నిర్మించిన చిత్రమిది. వచ్చే రెండుమూడేళ్లలో దక్షిణాది భాషల్లోనూ సినిమాలు రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందీ సంస్థ.

తొలి అడుగు
అసలు మనమార్కెట్‌లోకి అడుగుపెట్టి హిందీలో ఒక సినిమా తీసిన తొలి హాలీవుడ్‌ సంస్థ... సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. 2008లో ఈ సంస్థ తీసిన 'సావరియా' ఆశించినంత విజయం సాధించనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాల్లో విడుదల చేయడంతో దాదాపు రూ.80కోట్లు సంపాదించి పెట్టింది.

ఇక... టెర్మినేటర్‌, అవతార్‌ లాంటి సినిమాలతో భారతీయ ప్రేక్షకులకు చిరపరిచితమైన నిర్మాణ సంస్థ ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌. మరో ప్రముఖ సంస్థ 'స్టార్‌ నెట్‌వర్క్‌'తో కలిసి 'ఫాక్స్‌ స్టార్‌' పేరుతో షారుక్‌ హీరోగా వచ్చిన 'మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌' చిత్ర హక్కుల్ని కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.

ఇట్నుంచి అటూ...
హాలీవుడ్‌ సంస్థలు మన సినిమాలు తీయడమే కాదు... మన భారతీయ సంస్థలు అమెరికాలో మార్కెట్‌ పెంచుకునే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ అమెరికాలో భారతీయులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో థియేటర్లను భారీగా కోనుగోలు చేస్తోంది. అంతేకాదు, వినోద రంగంలో తమదైన ముద్ర వేయాలనుకుంటున్నట్టు రిలయన్స్‌ సంస్థ 2008 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఘనంగా ప్రకటించింది కూడా.

యూటీవీ వోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ సంస్థతో కలిసి 'ఐ థింక్‌ ఐ లవ్‌ మై వైఫ్‌', 'ద హ్యాపెనింగ్‌ (ఈ సినిమాకి దర్శకుడు- ప్రవాసభారతీయుడు మనోజ్‌ శ్యామలన్‌ నైట్‌)', 'ద నేమ్‌సేక్‌' అనే సినిమాల నిర్మాణంలో పాలుపంచుకుంది.

ఇంకా మరెన్నో సంస్థలు హాలీవుడ్‌ సంస్థలతో కలిసి సంయుక్త ప్రాజెక్టులు చేపట్టి భారతీయుల సత్తా చూపేందుకు సిద్ధంగా ఉన్నాయి.