ఆర్థికమాంద్యం ఆవరించిన పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనక తప్పదని అంతా అనుకున్నారు. చిత్ర నిర్మాణంలో, చెల్లింపులలో కాస్త ఇబ్బందిని ఎదుర్కొన్నా, వ్యాపారం చేసుకోవడంలో, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో హాలీవుడ్ విజయం సాధించింది. 2009లో అమెరికా, కెనడాలలో 8.6శాతం వృద్ధిని సాధించి పది బిలియన్ డాలర్లు వసూలు చేసి పెట్టింది. ఇది ఆల్‌టైం రికార్డు. ఇది 2008 కంటే 4.5శాతం ఎక్కువ. గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్ కలెక్షన్లు తగ్గుతూ రావడం, ఈ సంవత్సరం టికెట్ ధర పెంపువల్ల కూడా అంతా భయపడినా ఊహించని విధంగా రికార్డు బ్రేక్ కలెక్షన్లు సాధించడానికి కారణం ఈ సంవత్సరం వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలనే చెప్పాలి. థియేటర్ వసూళ్ళే కాకుండా డివిడి అమ్మకాల ద్వారా ఈ సంవత్సరం 13 శాతం ఎక్కువ రెవెన్యూ సాధించగలిగింది. ఐమాక్స్, త్రీ-డి ప్రదర్శనలకు పది డాలర్లు, పదిహేను డాలర్లుగా ధరలను పెంచినా అవి ప్రజలను అమితంగా ఆకర్షించగలిగాయి. హోం థియేటర్లు డివిడిలతో ఇంట్లో మగ్గిపోయే ప్రజలను ఇవి థియేటర్ల వద్దకు రప్పించగలిగాయి. హాలీవుడ్ మార్కెట్ అమెరికాకే పరిమితం కాలేదు. ఇంగ్లడ్, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, మెక్సికో, బ్రెజిల్ మొదలైన ప్రధాన యూరోపియన్ మార్కెట్లలో కూడా బాక్స్ ఆఫీస్ వసూళ్ళను సాధించడం విశేషం.

త్రీ-డి నిర్మాణం నిస్సందేహంగా హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది. దీనివల్ల లభించే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఒక వైపు, పెంచిన సర్‌చార్జీలు ఇంకోవైపు స్టూడియోలకు ఎగ్జిబిటర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి. అదీగాక ఈ సంవత్సరం వచ్చిన హాలీవుడ్ చిత్రాలు వైవిధ్యభరితంగా వుండటం కూడా వసూళ్లకు ఒక కారణం. 2008లో నెంబర్ వన్ చిత్రం 'ది డార్క్ నైట్' 533 మిలియన్ డాలర్లను వసూలు చేయగా, ఈ సంవత్సరం నెంబర్ వన్ చిత్రం 'ట్రాన్స్‌ఫార్మర్స్-2' 402మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంతటిస్థాయిలో కాకపోయినా 'స్టార్ ట్రెక్' 'ది ట్విలైట్ సాగా', 'న్యూమూన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-4' చిత్రాలు 150 మిలియన్ డాలర్ల నుంచి 300 మిలియన్ డాలర్లను వసూలు చేసి పెట్టాయి. సైన్స్ ఫిక్షన్‌లో 'వాచ్‌మెన్', 'ప్లానెట్ 51', 'సర్రోగేట్స్', 'స్టార్‌ట్రెక్' విజయం సాధించగా, రీమేక్ సినిమాలుగా వచ్చిన 'ఫ్రైడే ది థర్టీన్', 'పింక్ పాంథర్-2', 'నైన్' యావరేజిగా ఆడాయి. సీక్వెల్‌గా తీసిన 'ఎక్స్‌మెన్ ఒరిజిన్స్: వోల్వరిన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-4', 'నైట్ అట్ ది మ్యూజియం-2'తో పాటు 'ది ప్రపోజల్', 'బ్రైడ్‌వార్స్', 'బెంజమిన్‌బటన్', 'హన్నా', 'మొంటానా', 'డొరియన్‌గ్రే' విజయం సాధించాయి. 'ఏంజిల్స్ అండ్ డెమన్స్', 'ట్రాన్స్‌ఫార్మర్స్-2', 'టెర్మినేటర్-4', 'ది ఇంటర్నేషనల్', 'షెర్లాక్‌హోమ్స్', '2012', 'అవతార్'లతో పాటు రాజకీయ చిత్రాలుగా వచ్చిన 'పబ్లిక్ ఎనిమీస్', 'ఇంగ్లోరియస్ బాస్టర్స్' కూడా రికార్డుబ్రేక్ కలెక్షన్లను సాధించి పెట్టాయి. యానిమేషన్ చిత్రాలలో 'మాన్‌స్టర్స్ వర్సెస్ ఏలియన్స్', 'ఐస్‌ఏజ్-3', 'అప్' పెద్ద హిట్లుగా నిలిచాయి. ఈ సంవత్సరంలో విచిత్రం ఏమిటంటే ఎవరి అంచనాకు అందకుండా చడీచప్పుడు లేకుండా వచ్చిన రెండు స్మాల్ బడ్జెట్ సినిమాలు 'అప్', 'హాంగోవర్' కనివినీ ఎరుగని సంచలనాత్మక విజయాలతో భారీ బడ్జెట్ చిత్రాలను తలదన్ని, అత్యధిక వసూళ్లను రాబట్టడం హాలీవుడ్‌నే నివ్వెరపరచింది.
భారతదేశంలో - ఈ ఏడాది హాలీవుడ్ చిత్రాల అనువాదం విపరీతంగా పెరిగిపోయింది. కాస్త విజయం సాధిస్తుందని నమ్మకం కలిగితేచాలు వాటిని అనువదించి విడుదల చేస్తున్నారు. హాలీవుడ్‌లో పాతబడిన థర్డ్‌గ్రేడ్ చిత్రాలను, సింగపూర్ - హాంగ్‌కాంగ్, థాయిలాండ్, చైనీస్ చిత్రాల అనువాదాలు కూడా వచ్చాయి. హాలీవుడ్ ప్రచారాన్ని చూసి, ఇక్కడి నేటివిటిని పట్టించుకోకుండా అనువదించిన 'ఏంజిల్స్ అండ్ డెమిన్స్', 'ది ట్విలైట్‌సాగా: న్యూమూన్ చిత్రాలు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి. యాక్షన్ సినిమాలు బాగానే సొమ్ము చేసుకున్నాయి. 'మమ్మీ' తర్వాత '2012' అనువాద చిత్రం రికార్డు కలెక్షన్లతో ప్రధాన తెలుగు చిత్రాల్ని పక్కననెట్టింది. దేశవ్యాప్తంగా అనువాదాలతో సహా ఆరువందల ప్రింట్లతో విడుదలైన 'అవతార్', '2012' చిత్రం కంటే ఎక్కువ వసూళ్ళను తెచ్చి పెడుతోంది. ఎందుకంటే సరైన తెలుగు చిత్రాలేవీ పోటీలో లేకపోవడం కూడా 'అవతార్'కు లాభిస్తుంది.
|