Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
హాలీవుడ్‌ చిత్రాల హంగామా

      కథా దారిద్య్రం వంటి రకరకాల కారణాలతో 2009లో బాలీవుడ్‌ బాగానే బెంగటిల్లింది. కానీ అదే సమయంలో 'హ్యాంగోవర్‌' వంటి ఓ మోస్తరు హాలీవుడ్‌ చిత్రాలు కూడా ఇక్కడ వీర విహారం చేసేశాయి. కేవలం 45 ప్రింట్లతో రీలీజైన ఈ సినిమా భారత్‌లో రూ.10 కోట్లపై చిలుకు వసూళ్లు సాధించింది! అయితే గతేడాది సిసలైన విజయగాథ మాత్రం సోనీ పిక్చర్స్‌ '2012'దే! నవంబర్‌ 13న విడుదలైన ఈ సినిమా తొలి ఆరు వారాల్లోనే ఏకంగా రూ.90 కోట్ల మార్కు దాటేసి భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్‌ సినిమాగా రికార్డు కొట్టేసింది. ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ పతాకంపై జేమ్స్‌ కామెరూన్‌ ఆవిష్కరించిన దృశ్యకావ్యం అవతార్‌ కూడా భారత్‌లో మూడు వారాల్లోనే రూ.67 కోట్లు కొల్లగొట్టి టెటానిక్‌ రికార్డును (55 కోట్లు) సముద్రంలో పడేసింది. ఇవన్నీ ఇచ్చిన ఉత్సాహమో ఏమో గానీ 2010లో ఇండియన్స్‌కు ఇంకా వినోదం పంచేస్తామంటూ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియో (ఇండియా) సిఈఓ విజయ్‌సింగ్‌ సంబరపడిపోతున్నారు! 'ద నేమ్‌ ఈజ్‌ ఖాన్‌' పంపిణీకి కరణ్‌జోహర్‌కు చెందిన డ్రామా ప్రొడక్షన్స్‌తో ఫాక్స్‌ ఒప్పదం కుదుర్చుకోవటమే దీనికి కారణం. ముంబై మురికివాడలే కథాంశంగా డానీ బోయల్‌ తీసిన స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ ఇంగ్లీష్‌ వెర్షన్‌ కంటే హిందీలోనే ఎక్కువగా నిశ్శబ్ద వసూళ్లు సాధించింది. ఐస్‌ ఏజ్‌-3 వంటి యానిమేటెడ్‌ సినిమా కూడా రూ.9 కోట్లు కళ్లజూసింది. ఏంజెల్స్‌ అండ్‌ డెమన్స్‌ రూ.10 కోట్లు, లిమిటెడ్‌ ఎడిషన్‌గా కేవలం 17 రోజుల పాటు ప్రదర్శించిన మైకేల్‌ జాక్సన్‌ 'దిసీజ్‌ ఇట్‌' రూ.4 కోట్లు వసూలు చేశాయి. నిజానికి మూడేళ్లుగా భారత్‌లో హాలీవుడ్‌ సినిమాలు బాగానే వెలుగుతున్నాయి. 2007లో స్పైడర్‌మ్యాన్‌-3 రూ.68 కోట్లు వసూలు చేసింది. 2008లో 'హ్యారీపోటర్‌ అండ్‌ హాఫ్‌ బ్లడ్‌ ప్రిన్స్‌' రూ.25 కోట్లు కొల్లగొట్టింది. ఇక జేమ్స్‌బాండ్‌ సిరీస్‌కు ఇక్కడ ఎప్పుడూ మినిమమ్‌ గ్యారెంటీనే! వీటి స్ఫూర్తితో 2010లో భారత్‌ మార్కెట్‌ను ముంచెత్తేందుకు అమేలా, డేట్‌నైట్‌, వాల్‌స్ట్రీట్‌-2, క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా-3, హ్యారీపోటర్‌, అందాల రాణి ఏంజెలినా జోలీ లేడీ బాండ్‌గా కనువిందు చేయనున్న 'సాల్ట్‌' వంటి సినిమాలు శరవేగంగా ముస్తాబవుతున్నాయి.

భారత్‌ మార్కెట్‌ సత్తాను హాలీవుడ్‌ కూడా గుర్తించింది. అందుకే ఇక్కడ సినిమాల్ని వీలైనన్ని ఎక్కువ ప్రింట్లతో విడుదల చేస్తోంది. 2012నే తీసుకుంటే అది భారత్‌లో ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఏకంగా 766 ప్రింట్లతో రిలీజైంది! సినిమా యాడ్‌ పోస్టర్లు మొదలుకొని టీవీ ప్రోమోల డిజైనింగ్‌ దాకా అడుగడుగునా శ్రద్ధ తీసుకున్నారు. దాంతో మల్టీప్లెక్సులు, మామూలు హాళ్లనే తేడా లేకుండా జనం విరగబడ్డారు. ఎప్పుడూ హాలీవుడ్‌ సినిమాలకు వెళ్ళని వాళ్లు కూడా థియేటర్లకు పరుగులు తీయడం వెనక టీవీ ప్రోమోలదే ప్రధాన పాత్ర. 'హ్యారీపోటర్‌ అండ్‌ హాఫ్‌ బ్లడ్‌ ప్రిన్స్‌' కూడా 330 ప్రింట్లతో విడుదలైంది! మైకేల్‌ జాక్సన్‌ 'దిసీజ్‌ ఇట్‌' కూడా 173 ప్రింట్లతో అలరించింది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005