మసాలా
 
 
 
 
మనం కోల్పోతున్నది చూపిస్తాం
ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య క్రికెట్‌ పోటీ ఎలా ఉంటుంది ! గల్లీ కుర్రోడికి, విశ్వనాథ్‌ ఆనంద్‌కు మధ్య చదరంగం !...ఊహూ ఏమాత్రం రసవత్తరంగా ఉండదు. బలహీన-బలమైన పోటీని ప్రేక్షకులు ఎప్పుడూ కోరుకోరు. సమవుజ్జీల మధ్యే ఆట రసవత్తరంగా నడుస్తుంది. అది క్రికెట్‌ అయినా, చదరంగమైనా...చివరికి సినిమా అయినా అంతే ! ఈమాటే బాలీవుడ్‌ హీరో హృతిక్‌రోషన్‌ ఇలా చెబుతున్నాడు...'నాకన్నా బలవంతుడ్ని ఎంచుకుంటాను. అతను శక్తి కోల్పోతున్నప్పుడు అలా కాదు, ఇలా అని సలహాలిస్తాను. తన శక్తుయుక్తులు పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశమమిచ్చి అప్పుడు రంగంలోకి దిగుతాను' అని సెలవిస్తున్నాడు. చిన్నప్పట్నించీ అలాంటి పోటీదారుడు ఎదురుకాలేదంట ! కైట్స్‌, గుజారిష్‌ సినిమా వైఫల్యాలతో రేసులో కాస్త వెనకబడ్డ హృతిక్‌...'జిందగీ నా మిలేగీ దోబారా' సినిమాతో మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన చెబుతున్న సంగతులు...

మనిషిలా పుట్టే అవకాశం ఒక్కసారే వస్తుంది. ఇంత చిన్న జీవితాన్ని ఆస్వాదించకుండా ఏవేవో ఆలోచిస్తూ బుతుకుతుంటారు. రేపు ఎలా ! పదేళ్ల తర్వాత ఏం చేయాలి ! పక్కవాడు మనకన్నా ఎదిగిపోతున్నాడేమో !...ఇలాంటి అనేక భయాల మధ్య బుతుకుతాం. ఇవన్నీ వద్దు...అని చెప్పే కథాంశమే రాబోయే చిత్రం 'జిందగీ నా మిలేగీ దోబారా'. జీవితం ఒకటే నిజమన్నది చాలామంది తెలిసీ విస్మరిస్తున్నారు. యాంత్రికమైన జీవనంలో మనం కోల్పోతున్నది ఏమిటో ! మా సినిమాలో చూపిస్తాం.

సాధారణ జీవితాన్నే ఇష్టపడతా...
వంద అంతస్తుల భవంతిలో ఉన్నా, పూరి గుడిసెలో ఉన్నా, జీవితం ఒక్కటే. మనమంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్న వాళ్లమే. స్టార్‌ అయినంత మాత్రాన నా జీవన విధానంలో వచ్చే మార్పులేం కనిపించవు. అంతేగాక కొన్ని ఆనందాలు కుదించుకుపోతాయి. నేనెప్పుడూ సాధారణ జీవితాన్నే ఇష్టపడతాను. రాబోయే చిత్రంలో నా పాత్ర అలాగే ఉంటుంది. మంచి పాత్ర చేస్తున్నా.

నిరాశపర్చలేదు...
గుజారిష్‌, కైట్స్‌ ఫలితాలు నన్న నిరాశపర్చలేదు. రెండూ ప్రయోగాలే. మూస ధోరిణిలో పోతున్నానని అనుకొన్న సమయంలో చేసిన చిత్రాలివి. సినిమాలు చేస్తున్నప్పుడు ఓ స్టార్‌లా ఆలోచించలేదు. నటుడిగా నాకేం కావాలో ఆ దారిలోనే వెళ్లాను. నా ఎంపిక పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది. కైట్స్‌ చిత్రం కోసం నేనెంత కష్టపడ్డానో నాకు తెలుసు. పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిన చిత్రం. గుజారిష్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

దేహానికి ప్రాధాన్యత లేదు...
నువ్వు ఎలా కనిపిస్తావు అనేదాని కన్నా, నువ్వెలా ప్రవర్తిస్తున్నావ్‌ అనేది ముఖ్యం. నా దృష్టిలో అందం అంటే అదే. మనలోని మంచి ఆలోచనలు ఇతరుల్ని తప్పకుండా ఆకర్షిస్తాయి. దేహధారుడ్యానికి అంత విలువ ఇవ్వవలసిన అవసరం లేదు. అయితే ఇప్పటికే నేను ప్రపంచంలో అందరి దృష్టినీ ఆకర్షించే మగవాళ్ల జాబితాలో ఉంటాననే నమ్మకం ఉంది. ముసలితనం వచ్చేస్తే...అన్న భయం లేదు.

కత్రినా...అంకితభావమున్న నటి
జిందగీ నా మిలేగి దోబారా...సినిమాలో కత్రినాకైఫ్‌తో కలిసి నటిస్తున్నా. ఆమె నటించిన సినిమాల్లో ఒక్కటీ ఇంత వరకూ చూడలేదు. తొలిసారి సెట్‌లోనే ఆమె ప్రతిభ పరిశీలించాను. సన్నివేశం గురించి చెప్పగానే...ఇక పాత్రలో ప్రవేశిస్తుంది. ఇంకా బాగా చేయాలి అనే ఆలోచనల్లోనే ఉంటుంది. తనలోని అంకితభావం నాకు బాగా నచ్చింది. ఆమెకు హిందీ భాష రాదు. అయినా బాలీవుడ్‌లో ఈస్థాయికి ఎదిగిందంటే అదంతా పని మీద ఆమెకున్న శ్రద్ధే. భాష నేర్చుకుంటే మరింత మంచి నటన ప్రదర్శిస్తుందనే నమ్మకం ఉంది.