ఎప్పుడూ విలన్ పాత్రలతో విసిగిపోయిన గుల్షన్ గ్రోవర్ ఇప్పుడు ఒక వినూత్న పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన తాజాగా ‘ఐ యామ్ కలామ్’ అనే విలక్షణ సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు. ఏంజిలిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఇది ప్రదర్శితమవుతోంది. దీనికి గుల్షన్ కూడా హాజరవుతున్నారు. ఐయామ్ కలామ్ నిజంగా అసాధారణ చిత్రమని, దీనిపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి పెరిగిందని అన్నారు. నూతన దర్శకుడు నీలా మాధబ్ నిర్దేశతకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఓ పేద బాలుడి చుట్టూ తిరుగుతుంది. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ జీవితం స్ఫూర్తిగా ఈ కథను అల్లుకున్నారు.
ఈ సినిమా ప్రదర్శనకు హాజరుకావడానికి గుల్షన్ ఇది వరకే లాస్ ఏంజిలిస్ చేరుకున్నారు. ఢిల్లీలోని ఓ మురికివాడకు చెందిన 12 ఏళ్ల బాలుడు హర్ష్ మయార్, హుసాన్ సాద్, గుల్షన్, బీట్రిస్ ఓర్డిక్స్ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. ‘కళాకారుడిగా సినీరంగంలో నేను ఉన్నతశిఖరాలను చూశాను. అయితే ‘ఐ యామ్ కలామ్’కు వచ్చిన స్పందన ఊహించడానికే సాధ్యం కాలేదు. ఇది తప్పకుండా అసాధారణ సినిమా. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ సినిమాకు చక్కటి ఆదరణ కనిపించడంతో ఐ యామ్ కలామ్ ఫొటోలు, ట్రెయిలర్లను హాలీవుడ్ మిత్రులకు ఈ మెయిల్ చేస్తూ ఈ సినిమాను ప్రచారం చేయాలని కోరాను’ అని గుల్షన్ గ్రోవర్ వివరించారు. స్మైల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్మించిన ఐ యామ్ కలామ్ పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడం ఎంత ముఖ్యమో చక్కగా వివరిస్తుంది.
ఒక ఎన్జీవో సినిమా తీయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐ యామ్ కలామ్ కథానాయకుడు హర్ష్‌కు 58వ జాతీయ అవార్డుతోపాటు, ఇది వరకే 12 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఇది ఈ నెలాఖరులో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.