వారం రోజులపాటు హైదరాబాద్ నగరంలో ఉత్సాహంగా జరిగిన 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దర్శకులకు, చిత్రాలకు బంగారు ఏనుగు పురస్కారాలను అందజేశారు. వారం రోజులపాటు ఆనందంగా గడిపిన బాలబాలికలు ఇక ఆదివారం గజ్జూకు టాటా చెప్పారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన 17వ బాలల చలన చిత్రోత్సవాల ముగింపు ఉత్సవాలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పెద్ద నిర్మాతలు, దర్శకులు పిల్లల చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రెగ్యులర్ సినిమాలు చిత్రీకరిస్తూనే సామాజిక బాధ్యతతో పిల్లల సినిమాలూ తీయాలని విజ్ఞప్తిచేశారు. ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి సినిమాలు రూపొందించాలని చెప్పారు. ప్రభుత్వం కూడా పిల్లల చిత్రాలు రూపొందిస్తే సాయం అందజేస్తోందని, రాయితీలు కల్పిస్తోందని గుర్తుచేశారు. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డికె అరుణ మాట్లాడుతూ బాలల చలన చిత్రోత్సవం విజయవంతమైందన్నారు. ఈ చలన చిత్రోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఫిల్మ్ మేకింగ్, వర్క్‌షాప్‌ల వంటివి నిర్వహించామని తెలిపారు. కేరళ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎంకె మునీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా(సిఎఫ్‌ఎస్‌ఐ) చైర్‌పర్సన్ నందితాదాస్, సిఎఫ్‌ఎస్‌ఐ సిఇవో సుశోవన్ బెనర్జీ, సమాచార శాఖ కమిషనర్ బి వెంకటేశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగారు ఏనుగు పురస్కారాలను గవర్నర్ నరసింహన్‌తోపాటు, మంత్రి డికె అరుణ, సినీనటులు రాజేంద్రప్రసాద్, నిర్మాత డి సురేష్‌బాబు తదితరులు అందజేశారు. భారతదేశ విభాగంలో 'దేక్ ఇండియన్ సర్కస్', 'ఐయాం కలాం', 'చిల్లర్ పార్టీ', 'విహిర్' సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, మోహినీ నృత్యం అందరినీ అబ్బురపరిచాయి. వికలాంగ కళాకారులు రూపొందించిన వీల్ చైర్ భరతన్యాటం కూడా అందరినీ ఆకట్టుకుంది. బంగారు ఏనుగు పురస్కారాన్ని గెలుచుకున్న మెడో చిత్రాన్ని చివరగా ప్రదర్శించారు.
పురస్కారాల వివరాలు :
* ఉత్తమ బాలల చిత్ర దర్శకులు : మరుణ్ హల్దార్, వినీత్
నాయక్(హమారీ దునియా)
* ద్వితీయ ఉత్తమ చిత్ర దర్శకులు : ఆర్యన్, షుగ్, సమురారు
(అడ్వెంచర్ ఆఫ్ ఎడ్డీ అండ్ కర్ట్)
*ఉత్తమ ద్వితీయ లఘుచిత్రం : ద బాల్
* ఉత్తమ లఘు చిత్రం(చిల్డ్రన్స్ జ్యూరీ) : నైన్ అండ్ హాఫ్స్ గుడ్‌బారు
* ఉత్తమ లఘు చిత్రం : నైన్ అండ్ హాఫ్స్ గుడ్‌బారు
* ఉత్తమ స్క్రీన్‌ప్లే(జాతీయ విభాగం) :సంజరు చౌహాన్(ఐయాం కలాం)
*ద్వితీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్(జాతీయ విభాగం) : దేక్ ఇండియన్ సర్కస్
*ఉత్తమ బాలల చిత్ర దర్శకులు(జాతీయ విభాగం) : ఉమేష్ కులకర్ణి(విహిర్)
*ఉత్తమ ఫీచర్ ఫిల్మ్(జాతీయ విభాగం, చిల్డ్రన్స్ జ్యూరీ) : చిల్లర్ పార్టీ
*ఉత్తమ ఫీచర్ ఫిల్మ్(జాతీయ విభాగం) : చిల్లర్ పార్టీ
*ఉత్తమ స్క్రీన్‌ప్లే(అంతర్జాతీయ విభాగం) : ద స్ట్రాంగెస్ట్ మెన్ ఇన్ హాలెండ్
* ద్వితీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్(అంతర్జాతీయ విభాగం) : ద అగ్లీ డిక్లింగ్
*ఉత్తమ దర్శకులు : విబెకా ముసాయా(ఆఫ్రికా)
*ఉత్తమ స్క్రీన్‌ప్లే ఫిల్మ్(చిల్డ్రన్స్ జ్యూరీ) : ద క్రొకోడైల్స్ స్ట్రయిక్ బ్యాక్
* ఉత్తమ ఫీచర్ ఫిల్మ్(అంతర్జాతీయ విభాగం) : మెడో