Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ప్రేమించి పెళ్ళి చేసుకుంటా!

      మా అమ్మానాన్నలది ప్రేమ వివాహం. వాళ్ళలానే నేనూ ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే అటువంటిదేమీ లేదు. షూటింగ్‌లతో తీరిక దొరకట్లేదు. ఎప్పటికైనా, ఎవరినైనా ప్రేమిస్తే - అతని బలంతో పాటు బలహీనతనీ ఇష్టపడతాను. ఎందుకంటే... లోకంలో ఎవరూ 'మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌' కాదు - అని అంటోంది తెలుగు యువత కలలరాణి ఇలియానా.

గోవాలోని ఓ 'స్పా'కు మొదటి యాడ్‌ ఫిలిం చేయడంతో నా కెరీర్‌ ప్రారంభం అయ్యింది. దాని తర్వాత సీరియస్‌గా చదువుకోవాలనుకున్నాను. అయితే, ఆ తర్వాత 'ఇమామి', 'ఎలక్ట్రోలక్స్‌', 'ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ' చేయడం, అవి పాపులర్‌ కావడంతో గోవా నుండి ముంబయ్‌కి నా మకాం మారింది. అప్పటికి నాకు సినిమాల్లో చేయాలన్న ఆలోచన లేదు. యాడ్స్‌ చూసి వై.వి.ఎస్‌.చౌదరి 'దేవదాసు'లో నాకు అవకాశం ఇచ్చారు. షూటింగ్‌ సమయంలో చౌదరి నాకు ధైర్యం చెప్పేవారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు చెయ్యొద్దనుకున్నాను. అయితే, ఆ చిత్రం షూటింగ్‌ దశలో ఉన్నప్పుడే ఎ.ఎం.రత్నంగారి అబ్బాయితో 'జాదూ'(తెలుగులో కె.డి)లో, మహేష్‌బాబుతో 'పోకిరి'లో అవకాశం వచ్చింది. 'పోకిరి' హిట్‌ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ రంగంలోనే ఉండిపోవాలనుకున్నాను.

నిజానికి, నాకు పదహారేళ్ళ వయసులోనే తొలి సినిమా అవకాశం వచ్చింది. 'ధైర్యం'లో హీరోయిన్‌ కోసం తేజ మమ్మల్ని సంప్రదించారు. స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. కానీ ఎంపిక కాలేదు. ఆ పాత్రకు రైమాసేన్‌ను తీసుకున్నారు.

యాక్షన్‌, సెంటిమెంట్‌ కన్నా నాకు హాస్య చిత్రాలు చూడటం అంటే చాలా ఇష్టం. రొమాంటిక్‌ కామెడీలంటే మరీ ఇష్టం. కరణ్‌ జోహార్‌ తీసే సినిమాలన్నీ చూస్తాను. నా అభిమాన నటి కాజోల్‌. నా అభిమాన నటుడు అప్పట్లో హృతిక్‌ రోషన్‌. ఇప్పుడు సైఫ్‌ అలీఖాన్‌.

నేను చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా 'దేవదాసు'. అది నా తొలి చిత్రం కావడంతో పాటు, అందులో నా పాత్ర నా మనస్తత్వానికి దగ్గరగా ఉండటం మరో కారణం. అలానే ఎన్నో చిత్రాల్లో ఎందరు దర్శకులతో చేసినా మొదటి అవకాశం ఇచ్చిన వై.వి.ఎస్‌.చౌదరిగారంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎందుకంటే, నాకు నటనే తెలియని రోజుల్లో చాలా ఓపిగ్గా చెప్పి చేయించుకునే వారు ఆయన.

నలుపు, నీలం, ఎరుపు నాకు ఇష్టమైన రంగులు. మా అమ్మ చేతి వంట అంటే నాకు నోరూరిపోతుంది. ఫర్వాలేదు నేను కూడా వంట బాగానే చేస్తాను. పుస్తకాలు విపరీతంగా చదువుతాను. సిడ్నీషెల్డన్‌ రచనలు నచ్చుతాయి. ఫిక్షన్‌ కన్నా నాన్‌ ఫిక్షన్‌ ఎక్కువగా చదువుతాను. గ్రీస్‌ నాకు బాగా నచ్చిన టూరిస్ట్‌ స్పాట్‌.

భాష విషయంలో మొదట చాలా ఇబ్బందిగా అనిపించేది కానీ, ఇప్పుడు ఫర్వాలేదు. తెలుగు బాగా అర్థమవుతోంది. ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోగలను. కాకుంటే, పూర్తిగా తెలుగులో సమాధానం చెప్పలేను. కొంచం కొంచం మాట్లాడగలను.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005