అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి శాశ్వత వేదిక నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నా.. పట్టించుకోని సర్కారు... పదెకరాలను ముందే 'ఇందు'కు విందు చేసింది! ఇల్లు కట్టుకుంటాం.. కాస్తంత స్థలం ఇవ్వండి మహా ప్రభో.. అని సినీ, టీవీ కార్మికులు చాలా కాలం నుంచి మొత్తుకుంటున్నా స్పందించని ప్రభుత్వం.. అభివృద్ధి పేరుతో మిగిలిన 20 ఎకరాలను ఇప్పుడు సింగపూర్ సంస్థకు ధారదత్తం చేసింది! నిబంధనలకు గండి కొట్టి.. వాణిజ్య ప్రయోజనాలే మిన్నగా సాగుతున్న వ్యవహారం! నిజానికి అది చలన చిత్ర రంగ అభివృద్ధికి ఉద్దేశించిన భూమి! ఒకటీ రెండూ కాదు.. 30 ఎకరాలు!
జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)కి చెందిన స్థలంలో 20.63 ఎకరాలను 'సినీ విలేజ్'గా అభివృద్ధి చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. రామానాయుడు స్టూడియో, పద్మాలయా స్టూడియోలకు మధ్యలో ఉన్న ఈ భూమిని సింగపూర్ కన్సార్టియానికి అప్పగించింది.
బీసీఏ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాటినం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, సుర్బన ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ కంపెనీలు కన్సార్షియం భాగస్వాము లు. సినీ విలేజ్‌లో భాగంగా వెయ్యి సీట్ల సా మర్థ్యం గల సినీ కన్వెన్షన్, మూడు థియేటర్లతో సినీ హెరిటేజ్, కల్చరల్ సెంటర్, సినీ కార్మికులకు అపార్ట్‌మెంట్లు(505 ఫ్లాట్లు. ఒక్కోటి 700 చ.అ.), పార్కింగ్ స్థలం నిర్మిస్తారు.
అలాగే మరికొన్ని సర్వీస్ అపార్ట్‌మెంట్లు, త్రీ స్టార్ హోటల్‌ను కూడా కట్టాలని నిర్ణయించారు. వీటి నిర్మాణానికి కన్సార్షియం 100 మిలియన్ అమెరికన్ డాలర్లు (సు మారు 467 కోట్ల రూపాయలు) ఖర్చు చేయనుం ది. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే.. ఇందు కు చేసుకున్న ఒప్పందాలే విస్తుగొలుపుతున్నాయి.
కుదిరిన ఒప్పందం మేరకు... సినీ కన్వెన్షన్ సెంటర్, సినీ హెరిటేజ్, కల్చరల్ సెంటర్లలో డెవలపర్‌కు 74 శాతం, ఎఫ్‌డీసీకి 24 శాతం యాజమాన్య హక్కు ఉంటుంది. పార్కింగ్‌లో డెవలపర్‌కు 75 శాతం, ఎఫ్‌డీసీకి 25 శాతం హక్కు ఉంటుంది.
వీటి ద్వారా వచ్చే ఆదాయంలో 97 శాతం డెవలపర్‌కు, మూడు శాతం ఎఫ్‌డీసీకి లభిస్తుంది. చిత్ర కార్మికుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లను ఎఫ్‌డీసీకి కేటాయించారు. సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హోటల్స్‌పై పూర్తి హక్కులు డెవలపర్‌కే ఉంటాయి. వీటి ఆదాయం కూడా పూర్తిగా డెవలపర్‌కే వెళుతుంది. తన వాటాగా వచ్చే భాగాన్ని అమ్ముకునేందుకు డెవలపర్‌కు హక్కు ఉంటుంది.
ఈ మేరకు ఇప్పటికే ఎఫ్‌డీసీ, బీసీఏ కంపెనీల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కూడా జరిగినట్లు సమాచారం. ఏపీఐఐసీ ఈ ఒప్పందానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. షేక్‌పేట సర్వే నెంబర్ 403లో ఈ భూమి ఉంది. ఇక్కడే కొద్ది రోజుల కింద 10 ఎకరాలను ప్రభుత్వం ఇందు ప్రాజెక్ట్స్‌కు కేటాయించింది. మిగిలిన 20.63 ఎకరాల్లో సినీ విలేజ్‌ను నిర్మించేందుకు సింగపూర్ కన్సార్షియానికి అప్పగిస్తోంది.
ఈ ఎంవోయూ మొత్తం తప్పుల తడకలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కేటాయింపే నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఎలాంటి టెండర్లు లేకుండా ఒక సంస్థకు విలువైన ఈ భూమిని కట్టబెట్టడం ఇందులో మొదటి అంశం.
|