Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
వెండితెరకు కత్రీనా చెల్లి ఇసబెల్లా

     బాలీవుడ్‌కు మరో ప్రముఖ హీరోయిన్‌ చెల్లెలు రాబోతోంది. ఎవరో చెల్లెలు అంటే అంతగా ఆసక్తి ఉండకపోవచ్చు కానీ ఆమె అలాంటి ఇలాంటి హీరోయిన్‌ చెల్లెలు కాదు...తెలుగువారు ముద్దుగా మల్లీశ్వరిగా పిలుచుకునే కత్రినాకైఫ్‌కు స్వయానా సహోదరి. కరిష్మా చెల్లెలుగా కరీనా ఇప్పటికే బాలీవుడ్‌ రికార్డుల్ని చెరిగేస్తోంది. ఫరాఖాన్‌ కన్నా ఆమె చెల్లెలు టబు టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. కాజోల్‌ చెల్లెలు కూడా ఇప్పటికే రంగంలో ఉంది. ఇప్పుడు సరికొత్తగా ఫ్రెష్‌ లుక్స్‌తో అప్పుడే కడిగిన ముత్యంలా కనిపిస్తోంది కత్రినాకైఫ్‌ చెల్లెలు. ఇంతకీ ఆమె పేరు ఇసబెల్లా కైఫ్‌. ఇప్పటికైతే ఇదే పేరు. మరి సినిమాల్లోకి వచ్చేముందేమైనా న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుంటుందేమో అని బాలీవుడ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సొంత చెల్లెల్ని అక్కే దగ్గరుండి మరీ ప్రమోట్‌ చేస్తోందట. వేరే ఏ ఇతర నిర్మాతకో ఆ అవకాశం ఇవ్వక తానే స్వయంగా ఓ ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేస్తోందట. అది లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలా ఉండాలని భావిస్తోందట. ప్రస్తుతం ఫరాఖాన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘తీస్‌మార్‌ ఖాన్‌’ చిత్రంలో ఓ ఐటం సాంగ్‌ చేస్తోంది కత్రినాకైఫ్‌. తర్వాత ఫరాఖాన్‌ దర్శకత్వంలో తన చెల్లెలు హీరోయిన్‌గా ఓ సినిమా తీసేందుకు ప్లాన్‌ చేస్తోంది కత్రినా కైఫ్‌. ఇప్పటికే విదేశాలలో నటనలో, నాట్యంలో శిక్షణ తీసుకున్న ఇసబెల్లా కైఫ్‌ అక్క బాటలో నడుస్తుందో లేక తన స్టయిల్‌లో తాను నిరూపించుకుంటుందో వెండితెరపై చూడాల్సిందే...బాలీవుడ్‌లో చెల్లెళ్ల హవా నడిచినా...టాలీవుడ్‌లో మాత్రం చెల్లెళ్లు అంతగా రాణించలేకపోయారు. ఒకప్పటి జయసుధ చెల్లెలు సుభాషిణి నుంచి టాప్‌ స్టార్‌ ఆర్తఇగర్వాల్‌ చెల్లెలు అతిధి అగర్వాల్‌ కూడా పేరుతెచ్చుకోలేకపోయారు.

ఈ మధ్య అందాల నటి కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తోంది. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఇందుకు రివర్స్‌గేర్‌గా చెల్లెళ్లే ఎక్కువగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఇసబెల్లా కైఫ్‌ కూడా తన అక్కకు గట్టి పోటీ ఇస్తుందేమో చూడాలి.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005