మసాలా
 
 
 
 
ప్రపంచంలోనే ఉత్తమ తండ్రి జాక్సన్‌
పాప్‌ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన మైకేల్‌ జాక్సన్‌ బతికినంత కాలం విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఆయన నెవెర్‌ల్యాండ్‌ ఎస్టేట్‌లో హుందాగా బతికారు. చివరికి ఆర్థిక సమస్యలతో నెవెర్‌ల్యాండ్‌ను విక్రయించారు. కాగా జాక్సన్‌ మరణానంతరం ఆయన ఎంతగానో ప్రేమించి, నివసించిన నెవెర్‌ల్యాండ్‌ ఎస్టేట్‌ను తిరిగి కొనుగోలు చేయాలని నేడు జాక్సన్‌ పిల్లలు భావిస్తున్నారు.

పాప్‌ కింగ్‌ మైకేల్‌ జాక్సన్‌ పాటలను ఇష్టపడని సంగీత ప్రేమికులు ఉండరు. పలు సూపర్‌హిట్‌ ఆల్బమ్స్‌తో ఈ సెలబ్రిటీ సింగర్‌ పాప్‌ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మిలియన్ల డాలర్ల డబ్బును సంపాదించిన జాక్సన్‌ నెవెర్‌ల్యాండ్‌ ఎస్టేట్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. చివరికి ఆర్థిక ఇబ్బందులతో నెవెర్‌ల్యాండ్‌ ఎస్టేట్‌ను 50 మిలియన్‌ పౌండ్లకు విక్రయించారు. రెండు సంవత్సరాల క్రితం మృతిచెందిన జాక్సన్‌ తప్పనిసరి పరిస్థితిలో నెవెర్‌ల్యాండ్‌ను విక్రయించారట. అప్పుల్లో కూరుకుపోయిన ఆయన ఈ విక్రయంతో వచ్చిన డబ్బుతో ఆ ఊబి నుంచి బయటపడగలిగారు.

కాగా మైకేల్‌ జాక్సన్‌ మరణానంతరం ఆయన కుమారుడు ప్రిన్స్‌ మైకేల్‌ (13), కూతురు ప్యారిస్‌(12)లు నెవెర్‌ ల్యాండ్‌ ఎస్టేట్‌ను ఎలాగైనా తిరిగి కొనుగోలుచేయాలని భావిస్తున్నారు. చిన్నతనంలో నెవెర్‌ల్యాండ్‌ భారీ భవంతిలో గడిపిన రోజులను వారు గుర్తుచేసుకుంటున్నారు. తమ తండ్రి జ్ఞాపకార్థంగా అక్కడ కమ్యూనిటీ పార్క్‌, మూగ జీవులకోసం ఓ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని వారు తలపోస్తున్నారు. జాక్సన్‌ మరో కూతురైన ఏడు సంవత్సరాల బ్లాంకెట్‌ గత ఏడాది వేసవిలో నెవెర్‌ల్యాండ్‌కు వెళ్లింది. తన తండ్రి నివసించిన ఆ ప్రాంతాన్ని చూసి ఆమె ముగ్దురాలయ్యింది.

జాక్సన్‌ పిల్లలకి 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత తండ్రికి చెందిన మిలియన్ల డాలర్ల ఆస్తి వారికి చెందనుంది. ఆ వయస్సుకు చేరుకోగానే వెంటనే నెవెర్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలని వారు భావిస్తున్నారు. ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన తండ్రి జాక్సన్‌ అంటూ ఆయన మరణానంతరం పిల్లలు మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే.