చురకత్తుల్లాంటి చూపులతో గుండెలకు గాలాలు వేయడం, మెరుపులీనే మేనుతో మెస్మరైజ్ చేయడం ఆమెకు చాలా బాగా తెలుసు. ఇటీవలే ‘మర్డర్ 2’తో ప్రేక్షకుల మతులు పోగొట్టిన ఆ సౌందర్యరాశి... జాక్వెలిన్ ఫెర్నాండెజ్. మోడల్‌గా, నటిగా, కాలమిస్ట్‌గా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఈ సొగసరి... ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా నిజాయితీగా పని చేయాలంటోన్న జాక్ మనసులోని మాటలు...
శ్రీలంక రాజధాని కొలంబోలో పుట్టాను. అయితే చిన్నప్పుడే మా కుటుంబం మలేషియా వెళ్లడంతో నా బాల్యం కొంత అక్కడ సాగింది. నాకు ఒక అక్క, ఇద్దరన్నయ్యలు.
నా చదువు చాలావరకూ బెహ్రెయిన్‌లో సాగింది. స్కూల్లో చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఆటలాడేదాన్ని. డ్రామాల్లో నటించేదాన్ని. చదువులో కూడా ముందుండేదాన్ని. వివిధ సంస్కృతుల గురించి తెలుసుకోవడం, పలు భాషలు నేర్చుకోవడం ఇష్టం. అందుకే ప్రత్యేకంగా ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ నేర్చుకున్నాను.
మొదట్నుంచీ స్వతంత్రంగా ఆలోచించడం, వ్యవహరించడం అలవాటు నాకు. ఏం చదవాలి, ఏమేం నేర్చుకోవాలి, ఎటు అడుగు వేయాలి అనేది నాకు నేనే నిర్ణయించుకునేదాన్ని. ఇంట్లోవాళ్లు కూడా ఎప్పుడూ అడ్డుపడలేదు. ఎందుకంటే ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకునేదాన్ని కాదు. పైగా ఎందులో అడుగుపెట్టినా సక్సెస్ అవకుండా వదిలేదాన్నీ కాదు.
ఆస్ట్రేలియాలోని ముర్రే యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేశాను. తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టి, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంకల్లో పలు ష్యాషన్ షోల్లో పాల్గొన్నాను. శ్రీలంకలో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘లంక బిజినెస్ రిపోర్ట్’ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పనిచేశాను. ‘డెయిలీ మిర్రర్’ పత్రికకు చాలా కాలం ఆర్టికల్స్ రాసిన అనుభవం కూడా ఉంది.
2006లో మిస్ శ్రీలంకగా ఎంపిక కావడం నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ ఫేమ్ కారణంగానే ‘అల్లాద్దీన్’ సినిమాలో అవకాశం వచ్చింది. కాలేజీ విద్యార్థినిగా చక్కని పాత్ర, సుజయ్ ఘోష్ లాంటి మంచి దర్శకుడు, అమితాబ్ బచ్చన్, సంజయ్‌దత్ లాంటి గొప్ప నటులు... అంతకంటే ఏం కావాలి! ఈ చిత్రానికి గాను ఉత్తమ నూతన నటిగా ఐఐఎఫ్‌ఏ అవార్డు కూడా అందుకున్నాను.
‘మర్డర్’ ఎంత సెన్సేషనల్ హిట్టో అందరికీ తెలుసు. అందుకే సీక్వెల్‌లో అవకాశం రాగానే వెంటనే అంగీకరించాను. అయితే ఎక్కడో కాస్త భయం కూడా ఉంది. ఎందుకంటే ఆ సినిమా పేరు చెప్పగానే మల్లికా శెరావత్ గుర్తొస్తుంది. ఆ చిత్రం అంత ఇమేజ్ తెచ్చిందామెకు. మల్లికాకు ఏమాత్రం తీసిపోకుండా చేయాలి కదా!
అదేంటోగానీ చిన్నప్పుడు నన్ అయ్యి, సేవ చేయాలని చాలా ఆశగా ఉండేది. అలాగే చానళ్లకు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా చేయాలని కూడా ఉండేది. కానీ ఆ రెండూ కాకుండా నటినయ్యాను. ఒకందుకు ఇది కూడా మంచిదే. ఈ రంగంలో పేరుతో పాటు, డబ్బు కూడా బాగా వస్తుంది. కాబట్టి కావలసినంత సేవ చేయొచ్చు.
ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 2’, ‘రాజ్ 3’లో నటిస్తున్నాను. రెండూ సీక్వెల్సే. ‘హౌస్‌ఫుల్ 1’లో నేను నటించాను కాబట్టి ఫరవాలేదు. కానీ ‘రాజ్ 1’లో బిపాసా, ‘రాజ్ 2’లో కంగనా అదరగొట్టారు. కాబట్టి రాజ్ 3... నాకో పెద్ద సవాల్. వీటితో పాటు ఓ తమిళచిత్రం కూడా చేస్తున్నాను. అజిత్ హీరో.
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవ్ళాళ గెలుస్తాం. రేపు ఓడిపోతాం. నేడు ఓడిపోతే రేపు గెలుస్తాం. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. కానీ గెలుపోటములతో సంబంధం లేకుండా విజయం సాధించడానికి మన ప్రయత్నం మనం నిజాయితీగా చేయాలి. ఆ నిజాయితీ లేనిరోజు నిన్న, నేడు, రేపు... అన్నీ ఓటములే.
మా రెండో అన్నయ్య పుట్టాక అమ్మ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందట! కానీ అది ఫెయిల్ కావడంతో నేను పుట్టాను. దాంతో అమ్మ ఎప్పుడూ నువ్వు ఏదో అద్భుతం జరగడం వల్ల పుట్టావు, కాబట్టి మంచిగా జీవించి జన్మను సార్థం చేసుకోవాలి అంటూ ఉంటుంది.