సహజ సౌందర్య రాశి..ఒకనాటి యువత కలల రాణి..నేటి యువ అందగత్తెల రోల్‌మోడల్..ఇంతలా చెబుతున్నారు ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారు.. ఇంకెవరు మన అడవిరాముడుతో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ చిందేసి..అక్కినేనితో మేఘసందేశం పంపిన నెరజాణ..మన జయప్రద..వయసు పెరిగినా వన్నె తగ్గని అందం ఆమె సొంతం..1980 ప్రాంతంలో భారతీయ ప్రఖ్యాత నటులందరి సరసన నటించి మేటి నటిగా కీర్తి గడించిన జయప్రద ఇప్పటికీ అదే అందంతో అభిమానుల మనసు దోచుకుంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషల్లో హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలిగా రాజకీయాలలో రాణిస్తున్నారు. అయినా అడపాదడపా వెండి తెరపై తళుక్కుమంటున్నారు. ఇటీవల విలేకరులు అడిగిన ప్రశ్నలకు జయప్రద ఈ కింది విధంగా బదులిచ్చారు.ప్రశ్న : అందానికే అందంగా అభివర్ణిస్తున్న మీ నిజ స్వభావం గురించి?
జ: తొలిరోజుల్లో నాకు కొంచెం బిడియం ఎక్కువ. మాట్లాడడానికి కూడా సంకోచిస్తాను. ఉద్రేకం ఎక్కువ. ప్రస్తుతం చాలా ధైర్యశాలినయ్యాను. రాజకీయ రంగ ప్రవేశం తరువాత నాలో మరింత మార్పు వచ్చింది. ఏమీ తెలియని 13 ఏళ్ల వయసులోనే కథానాయకిగా తెరపైకొచ్చాను. నాటి నుంచి 35 ఏళ్లు నటిగా సుదీర్ఘ ప్రయాణం చేశాను. ఈ పయనంలో ఎన్నో కళాత్మక పాత్రలు పోషించాను.
ప్రశ్న : నటి కావాలనే ఆలోచనకు ఎలా అంకురార్పణ జరిగింది?
జ: నిజం చెప్పాలంటే నటి కావాలనే ఆసక్తి నాకు లేదు. చిన్నతనంలో చాలా తక్కువ సినిమాలే చూశా ను. అమ్మ ఆశ మేరకు నాట్యం, కర్ణాటక, సంగీతం నేర్చుకున్నాను. పాఠశాలలో స్టేజి కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. అప్పుడు ఒకాయన నన్ను సినీ రంగానికి పరిచయం చేశారు. డాక్టరు కావాలనేది నా కోరిక. తమిళంలో దర్శకుడు కె.బాలచందర్ మన్మథలీలై చిత్రం ద్వారా నన్ను హీరోయిన్‌గా పరిచయం చేశారు. నా అసలు పేరు లలితారాణి. తెలుగు ప్రముఖ నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి జయప్రదగా పేరు మార్చారు. ఈ పేరు నీకు అదృష్టాన్ని తీసుకొస్తుందని దీవించారు. ఆయన వాక్కు ఫలించింది.
ప్రశ్న : రాజకీయ రంగ ప్రవేశానికి కారణం?
జ: ఒక వ్యక్తిగా ప్రజలకు ఎలాంటి సేవ చేయడం సాధ్యం కాదు. ప్రజాసేవకు ఏదో ఒక ప్లాట్‌ఫామ్ అవసరం. అదే రాజకీయం. అందుకే రాజకీయూల్లోకి వచ్చాను. ధనార్జన కోసం కాదు. రాజకీయాలు నా మనస్తత్వానికి సరిపడవని తెలిసినా ఎన్‌టీఆర్ ఒత్తిడిమేరకే రాజకీయాల్లోకి వచ్చాను.
ప్రశ్న : మీరు అనుకున్నట్లుగా రాజకీయాల్లో ముందుకెళుతున్నారా?
జ: నిరుపేదల సాదక బాధలను రాజకీయూల్లోకి వచ్చిన తరువాతే తెలుసుకున్నాను. వారి దుస్థితి చూసి చాలా బాధపడ్డాను. ఆ భాధ నుంచే ధైర్యం పుట్టింది. 14 ఏళ్ల క్రితమే నేను పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల గురించి గళం విప్పాను. ప్రస్తుతం నేను మూడవసారి పార్లమెంటు సభ్యురాలిగా ఎంపికయ్యాను. ఆ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికీ అదే స్థితిలో ఉంది. మంచి, చెడు అన్ని రంగాలలోనూ ఉన్నాయి. రాజకీయ రంగంలో మోసం అనేది అధికంగా ఉంది. రాజకీయ సమస్యలు నన్ను కొంచెం బాధించాయి. అవన్నీ అధిగమించి రాణిస్తున్నాను.
ప్రశ్న : ఎందరో మీ ఆటోగ్రాఫ్ కోసం వేచి ఉంటారు. అలా మీరెవరి ఆటోగ్రాఫ్ కోసమైనా ఎదురుచూశారా?
జ: మదర్‌థెరిస్సా ఆటో గ్రాఫ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. ఒక బెంగాలీ చిత్రం కోసం రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమెను కలిశాను. ఆమెను చూసినపుడు కన్నతల్లిని చూసినంత ఆనందం కలి గింది. ఆమె ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అది ఇప్పటికీ పదిలంగా భద్రపరచుకున్నాను.