మసాలా
 
 
 
 
అది నిజం కాదు
సహజత్వం గల పాత్రల్లో నటించడం తనకు సౌకర్యంగా ఉంటుందని యువ నటుడు జీవా అంటున్నారు. వైవిధ్యభరిత పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చే ఈయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. నిన్న కో, నేడు రౌద్రం ఆయన నటనా ప్రతిభకు అద్దం పట్టాయి. రానున్న వందాన్ వెండ్రాన్ చిత్రం కూడా విజయం సాధిస్తుందంటున్న జీవాతో చిన్న భేటీ..

మీ కెలాంటి పాత్రలంటే ఇష్టం?
వాస్తవానికి దగ్గరగా ఉండేలా, పక్కా లోకల్ బాయ్ పాత్రలో నటించడం నాకు సౌకర్యంగా ఉంటుంది. శివమనసుల శక్తిలో సరిగ్గా ఈ తరహా పాత్రనే పోషించాను. అయితే కొందరు దర్శకులు క్లాస్ ఇమేజ్‌ను ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారు.

తాజాగా విడుదలైన రౌద్రం చిత్రానికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది?
పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారనే న మ్మకముంది. ఇందులో చక్కని సందేశం ఉంది.

తదుపరి విడుదల కానున్న చిత్రం?
వందాన్ వెండ్రాన్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాక్సర్‌గా నటించాను. ఇది ఒక హిందీ చిత్రానికి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు.

నటనలో ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటారు?
కమలహాసన్, రజనీకాంత్‌లనే స్ఫూ ర్తిగా తీసుకుంటాను. వారు పోషించని పాత్ర ఉండదనుకుంటా. అలాగే చిత్ర పరిశ్రమలో అపార అనుభవం గల నా తండ్రి ఆర్‌బి.చౌదరి సూచనలు, సలహాలు తప్పక పాటిస్తాను.

మీకు నచ్చిన, చూడాలనుకుంటున్న పర్యాటక ప్రదేశం?
నన్ను అమితంగా ఆకర్షించిన ప్రదేశం లండన్. ఆ సుందరమైన ప్రాంతాన్ని మరోసారి చుట్టి రావాలని అనుకుంటున్నాను. బిజీ కారణంగా ప్రయాణం వాయిదా పడుతోంది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా?
ఇండిపెండెన్స్‌డే అనేది మన దేశానికి చాలా గొప్ప పండుగ రోజు. పెళ్లి అయింది కాబట్టి ఆ స్వాతంత్య్రాన్ని నేను కోల్పోయాను అనుకోండి (నవ్వు). ప్రత్యేకంగా నిర్ణయాలంటూ ఏమీ లేవు. షూటింగ్ లేని రోజుల్లో ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపాలనుకుంటున్నా.