‘‘హన్సిక ఎనర్జీ నిజంగా సూపర్బ్. గులాబీరేకులా సుకుమారంగా... సుతిమెత్తగా కనిపించే తను... కెమెరా ముందుకెళ్లగానే చెలరేగిపోతుంది. తనకు అంత ఎనర్జీ ఎక్కడ్నుంచి వస్తుందో నాకు అర్థం కావడం లేదు’’... ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో హన్సికను ఉద్దేశించి జెనీలియా అన్న మాటలివి.వీరిద్దరూ తమిళంలో విజయ్‌కు జోడీగా ‘వేలాయుధం’లో నటించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా తమిళనాట విజయదుందుభి మ్రోగిస్తోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో పాల్గొన్న జెన్నీ పై విధంగా స్పందించారు.
ఇక హన్సిక... ‘నేనేమన్నా తక్కువ తిన్నాన్నా...’ అన్నట్టు ఓ తమిళ ఛానల్‌కి ఇచ్చిన తాజా ఇంటర్‌వ్యూలో జెనీలియా గురించి మాట్లాడుతూ ‘‘జెన్నీ చాలా క్యూట్. ఆమె క్యూట్ అప్పీల్ అంటే నాకు ప్రాణం. తెరపై ఆమె చేసే చిలిపి పనులు వేరే ఏ హీరోయిన్లు చేసినా నాకు చిరాగ్గా అనిపిస్తుంది. జెన్నీకి మాత్రమే ఆ క్యూట్‌నెస్ చెల్లుతుంది. తను నాకు మంచి ఫ్రెండ్. ఒకరికొకరం ఎంతో కోపరేట్ చేసుకుంటూ ఇందులో నటించాం’’ అని చెప్పుకొచ్చారు.
ఇలా వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు పాజిటీవ్‌గా మాట్లాడటం తమిళనాట చర్చనీయాంశం అయ్యింది. ‘వేలాయుధం’ నిర్మాణ దశలో వీరిద్దరిపై వచ్చిన గాసిప్పులే అందుకు కారణం. జెనీలియా, హన్సికల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని, వీరి కాంబినేషన్ సన్నివేశాలు తీయడానికి దర్శకుడు తల ప్రాణం తోకకు వస్తోందని, కొన్ని సందర్భాల్లో కొట్టుకునే దాకా వీరి వ్యవహారం వెళ్లిందని... ఇలా చిలువలు పలువలుగా వీరిపై గాసిప్పులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో... ఒకరి గురించి ఒకరు ఇలా పాజిటివ్‌గా స్పందించి కోలీవుడ్ మీడియా వారికి ఈ ముద్దుగుమ్మలు జలక్ ఇచ్చారు.