జిస్మ్‌లో బిపాసా బసు అంగాంగ ప్రదర్శన కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఇందులో అబ్రహాం, బిపాసా మధ్య కాస్త ఎక్కువ మోతాదులోనే శృంగార సన్నివేశాలు ఉంటాయి. దీనికి కొనసాగింపుగా జిస్మ్2 తీస్తున్నట్టు దర్శకుడు మహేశ్ భట్ ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా శృంగారతార సన్నీ లియోన్‌ను ఎంపిక చేయడం సంచలనం సృష్టించింది. ఈమె ప్రస్తుతం బిగ్‌బాస్ 5 రియాలిటీ షోలో హల్‌చల్ చేస్తోంది. టైటిల్ జిస్మ్ (దేహం) సూచిస్తున్నట్టుగా ఇది శారీరక ప్రదర్శనకు సంబంధించిన సినిమా కాదని మహేశ్ చెబుతున్నారు. తన కూతురు పూజాభట్ రూపొం దిస్తున్న ఈ సీక్వెల్‌లో నటించేందుకు సన్నీ లియోన్ అంగీకరించిందని ప్రకటించారు.
‘మిగతా విషయాల గురించి పూజా, సన్నీ ప్రతినిధి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అన్నీ సక్రమంగానే జరుగుతాయనీ, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందనీ ఆశిస్తున్నా’ అని మహేశ్ అన్నారు. ఇందులో ప్రధాన పాత్రను పోషించే అర్హతలన్నీ సన్నీకి ఉన్నాయనే అనుకుంటున్నానని చెప్పారు. మరో విశేషమేమంటే సన్నీకి మహేశ్ తారసపడ్డప్పుడు ఆయనెవరో కూడా గుర్తుపట్టలేకపోయిందట. దీనిని బట్టి చూస్తే ఆమె బాలీవుడ్ సినిమాలు చూడడం లేదని తెలుస్తుందని ఈ సీనియర్ దర్శకుడు అన్నారు. సన్నీ బాలీవుడ్‌లో అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తోందంటూ పలు కథనాలు వచ్చాయి.
అయితే ఈమె శృంగార తార కావడం వల్లే జిస్మ్2లో అవకాశం ఇచ్చారన్న వాదనను మహేశ్ తోసిపుచ్చారు. కేవలం నగ్నత్వంపైనే ఆధారపడలేమని, నటికి ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయని తెలిపారు. ఇందులో హీరో పాత్రకు ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. మహేశ్ భట్ కుమారుడు రాహుల్ భట్ ఈ సినిమాతో అరంగేట్రం చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇమ్రాన్ హష్మీ పేరు కూడా వినిపిస్తోంది. సన్నీ లియోన్ కెనడాలోని ఓ పంజాబీ కుటుంబంలో పుట్టిపెరిగింది. ఇదివరకే పలు అమెరికన్ టీవీ షోల్లో కనిపించింది.