మసాలా
 
 
 
 
ఆ లిస్టులో పేరే నా అదృష్టం
మగధీర, బృందావనం, మిస్టర్ పర్‌ఫెక్ట్... ఇలా వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న కాజల్ మనసులోని మాటలు...

ఏ భాషయినా ఓకే!
తెలుగులో నా మొదటి సినిమా ‘లక్ష్మీకళ్యాణం’. దానికంటే ముందు హిందీలో ‘క్యూం... హోగయా న’లో నటించాను. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. భాష ఏదైనా నా పాత్ర నచ్చితే చేసేందుకు సిద్ధపడతాను. నా పాత్రకు నూరుశాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను.

గర్వం లేదు!
దేవుడి దయవల్ల నేను చేసిన చిత్రాలన్నీ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నటిగా నా టాలెంట్ మరింత మెరుగుపడిందేమో కానీ వ్యక్తిగా నాలో ఎలాంటి మార్పూ లేదు. మొదటి సినిమా చేసినప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను. సక్సెస్ అయ్యానన్న గర్వం నాకు లేదు, ఉండకూడదు కూడా! ఈ రోజు టాప్ పొజిషన్లో ఉన్నవాళ్లకి రేపు అవకాశాలే లేకపోవచ్చు. అందుకే విజయాలు వచ్చినా మనం తగ్గి ఉండటమే మంచిది.

పోటీ ఎందుకుండదు!
టాలీవుడ్‌లో తారల మధ్య పోటీ లేదని అనను. కానీ ఎవరి అవకాశాలు వారికి తప్పకుండా ఉంటాయని మాత్రం చెప్పగలను. మనం కావాలనుకున్నంత మాత్రాన ఏ పాత్రా మనల్ని వెతుక్కుంటూ రాదు. ఏ పాత్రకి ఏ నటి సరిపోతుందో దర్శకుడికి ఒక అవగాహన ఉంటుంది. ఆయన ఆ నటినే ఎంచుకుంటాడు. అంతే తప్ప, ఈ పాత్ర నేనే చేయాలి అని పంతం పట్టే అవకాశం ఉండదు కదా! కాబట్టి పోటీ అన్నది పెద్ద సమస్యే కాదు.

ప్రేక్షకుల దృష్టి మారింది!
ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ఫెయిలవ్వాలన్నా అంతా ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది. సినిమాల విషయంలో ఈ మధ్య ప్రేక్షకుల టేస్ట్ బాగా మారింది. సినిమా ఎలా ఉన్నా చూసే రోజులు పోయాయి. వాళ్లకిష్టమైన ఏ అంశాలు మిస్సయినా ప్రేక్షకులు నిస్సందేహంగా సినిమాని చూడటం మానేస్తున్నారు. అంతేకాదు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు.

అది నిజం కాదు!
గ్లామర్ పాత్రలు చేసే వాళ్లకు మాత్రమే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలామంది అంటూ ఉంటారు. దాన్ని నేను ఎంతమాత్రమూ అంగీకరించను. నటికి అందం ఒక్కటే సరిపోదు. ప్రతిభ కూడా ఉండాలి. లేదంటే నేను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు. ఎందుకంటే నేను పూర్తిస్థాయి గ్లామర్ పాత్ర ఎప్పుడూ చేయలేదు. ‘లక్ష్మీకళ్యాణం’ నుంచి ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ వరకూ నటనకు ఆస్కారమున్న పాత్రల్ని ఆచితూచి ఎంచుకున్నాను.

అంతా నా అదృష్టం!
ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి యువ హీరోల పక్కన వరుసగా అవకాశాలు వస్తున్నాయి. వాళ్ల టాలెంట్‌కి, క్రేజ్‌కి తగిన హీరోయిన్ కోసం వెతికినప్పుడు నా పేరు వాళ్ల లిస్టులో ఉంటోందంటే అదృష్టమే కదా! బృందావనం, మిస్టర్ పర్‌ఫెక్ట్ మంచి విజయాన్ని సాధించాయి. తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని చిత్రాలు చేస్తున్నాను. అవి కూడా విజయం సాధిస్తాయనే నమ్మకంతో ఉన్నాను.