లోకనాయకుడు అనిపించుకున్న పద్మశ్రీ కమల్ హాసన్ ఇటీవల 50 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకోవడాన్ని ఆయన అభిమానులు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఆయన గౌరవార్థం తమిళనాట ఓ రోడ్డుకు ఆయన పేరు కూడా పెట్టబోతున్నారు. ఇలాంటి సందర్భంలో జరిగిన ఓ కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ పాల్గొని మాట్లాడారు. ' సినీ కళామతల్లికి కమల్ అంటే ప్రత్యేకమైన ప్రేమ. ఆ తల్లి ముద్దు బిడ్డ కమల్. మనందరికంటే నటనా కౌశలాన్ని ఆయనకు ఓ ముద్ద ఎక్కువే ప్రసాదించింది' అని రజనీ కొనియాడారు. ఆ కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది అభిమానులు రజనీ ప్రసంగానికి హర్షధ్వానాలు చేశారు. అంతటితో రజనీ ఊరుకోలేదు. తన ప్రసంగ సారాంశాన్ని ప్రతిబింబించే ఓ చిత్ర పటాన్ని ఇటీవల తయారు చేయించి కమల్‌కు కానుకగా పంపారు.
ఈ చిత్రపటంలో కలైతారు (కళామతల్లి) కమల్‌ను ఎత్తుకుని ఉంటుంది. రజనీకాంత్, అమితాబ్, మమ్ముట్టీ, మోహన్‌లాల్, చిరంజీవి వంటి వారంతా ఆమె వెంట అడుగులు వేస్తూ ఉంటారు. రజనీకాంత్ స్పందనకు కమల్ చలించిపోయారు. 'నా మిత్రుల ఔదార్యం నన్నెంతో కదిలించింది. మాట రావడం లేదు. స్నేహానికి గుర్తుగా ఈ చిత్ర పటాన్ని నా కార్యాలయంలో అలంకరిస్తాను' అని కమల్ చెప్పుకొచ్చారు.
|