|
* ‘కుర్బాన్’ స్టిల్ వివాదాస్పద మవుతుండడంపై మీ వివరణ ఏమిటి?
‘కుర్బాన్’ అనేది కేవలం ప్రేమకథాచిత్రం కాదు. ఇందులో చాలా అంశాలు మిళితమై ఉంటాయి. హింస కూడా ఈ చిత్ర కథాంశంలో భాగమే. అందుకే ఈ సినిమా ఎటువంటి సినిమానో సామాన్య ప్రేక్షకులకు కూడా సులభంగా అర్ధమయ్యేలా ఆ పోస్టర్‌ను అలా కావాలనే డిజైన్ చేయించారు. ఇందులో అసభ్యతకు తావుందని నేననుకోవడం లేదు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్ నిర్మిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆయన సకుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రాలు మాత్రమే తీస్తారు తప్ప ఏదో ఒక వర్గం చూసే సినిమాలు తీయరు కదా?
* ఇందులో మీ పాత్ర ఏమిటి?
ఓ యంగ్ ప్రొఫెసర్‌గా ఇందులో నాది చాలా కీలక పాత్ర. ‘జబ్ వియ్ మెట్’లో నేను పోషించిన గీత్ పాత్ర ఎలా ప్రేక్షకులకు గుర్తుండిపోయిందో, ఈ చిత్రంలో నేను పోషిస్తున్న అవంతిక పాత్ర కూడా ప్రేక్షకులకు చాలా రోజులు గుర్తుండిపోతుంది.
* ‘జబ్ వియ్ మెట్’ తర్వాత మీరు నటించిన ‘గోల్‌మాల్ రిటర్న్స్’ మాత్రమే విజయం సాధించింది. దీనిని మీరు ఎలా విశ్లేషించుకుంటారు?
ప్రతి పరాజయం మనకు పాఠమే. చేసిన తప్పులు మళ్లీ చేయకుండా ముందుకు సాగడం వివేకవంతుల లక్షణం. కొత్త తప్పులెలాగూ మనం చేస్తూనే ఉంటాం. అలా చేయకుండా ఉండగలిగితే మనం కూడా భగవత్‌స్వరూపులవుతాం.
* ‘కుర్బాన్’ చిత్ర కథాంశం ఏమిటి?
అవంతిక అనే ఓ యంగ్ ప్రొఫెసర్.. తనతోపాటు ప్రొఫెసర్‌గా పనిచేసే సైఫ్ అలీఖాన్ ప్రేమలో పడి అతనిని వివాహం చేసుకుని న్యూయార్క్ వెళ్లిపోతుంది. అక్కడ కొన్ని అనూహ్య పరిస్థితుల్లో టెర్రరిజం ఉచ్చులో చిక్కుకుంటుంది. దాన్నుంచి ఆమె ఎలా బయటపడిందన్నదే చిత్ర కథాంశం. ఓ రకంగా చెప్పాలంటె కథ మొత్తం అవంతిక పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. వివేక్ ఒబరాయ్, ఓంపురి, కిరణ్‌ఖేర్, దియామీర్జాలు ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోషించారు.
* సైఫ్‌తో మీ పెళ్లెప్పుడు?
నేనేం సమాధానం చెబుతానో మీకు తెలుసు. ప్రస్తుతం మా ఇద్దరి ధ్యాసంతా మా మా కెరీర్స్‌పైనే. పైగా పేరుకే మేము పెళ్లి చేసుకోలేదు కాని, ‘భార్యాభర్తలు’ మాదిరిగానే జీవిస్తున్నాం అన్న విషయాన్ని ఇప్పటికి చాలాసార్లు చెప్పాను.
|