ఇటీవల తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న తమిళ నటుడు కార్తి. యుగానికి ఒక్కడు తమిళంలో సరిగా ఆడకపోయినా,
తెలుగులో బాగానే ఆడింది. ఆ తర్వాత వచ్చిన 'ఆవారా', ఇటీవల వచ్చిన 'నా పేరు శివ' మొదలైనవి బాక్సాఫీస్ వద్ద
మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. వరుసగా వచ్చే ఏ రెండు చిత్రాలూ ఒకే విధంగా ఉండకుండా
జాగ్రత్తపడుతున్నాడు. తెలుగు నేర్చుకొని తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడంటే... తమిళ, తెలుగు భాషల్లో భారీ ప్రణాళికలే
వేసుంటాడు. అవేంటో వాటి సంగతేంటో కార్తి మాటల్లో విందాం...
* నేను చేసిన ప్రతీ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. వాళ్లకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం
లేదు. అందుకే త్వరలోనే ఓ తెలుగు సినిమా చేయాలని డిసైడ్ అయ్యా. మంచి కథల కోసం అన్వేషణ జరుపుతున్నా.
* తెలుగు దర్శకులు చాలామంది కథలు చెప్పారు. హై ఓల్టేజ్ ఉన్న కథ ఇది. ఎన్టీఆర్ లాంటి నటుడు చేయాల్సిన రేంజ్‌లో
ఉంటుంది. ఆయనైతేనే బాగుంటుందని చెప్పి పంపేశా.
* ఇప్పటివరకూ నాలుగు సినిమాలు చేశా. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. అయిదో సినిమాకూడా
అలాగే ఉండాలి. కథ ఎవరు చెప్పినా ఓకే చేసేస్తా. బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ ఫైనల్ అయింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్
నడుస్తోంది.
* అన్నయ్యతో కలిసి నటించటమంటే మామూలు విషయం కాదు. ఆయనకు సినిమా తప్ప మరో ధ్యాస లేదు.
మురుగదాస్ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నాడు. మా ఇద్దరి సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఆశిస్తారు.
అందుకే కొంచెం సమయం తీసుకొన్నా తప్పులేదు.
* అన్నయ్యగా నాకు ఆయన సలహాలు, సూచనలు అవసరం. 'నా పేరు శివ' చూసి ఇక నీకు చెప్పాల్సిందేమీ లేదు.
నువ్వు సరైన దారిలోనే నడుస్తున్నావ్' అని అన్నారు. తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి మాత్రం చాలా కష్టపడాల్సి
వచ్చింది. చిన్న చిన్న పదాలు పలికేప్పుడు చాలా కష్టం.
* తమిళ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు కొన్ని తేడాలున్నాయి. విమర్శనాత్మకంగా, విషాదంతో కూడిన సహజ కథలను
తమిళనాట ఆదరిస్తున్నారు. కానీ ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌కే మొదటి ప్రాధాన్యత. హీరో అంటే హీరోనే. ఏదైనా
చేయగలడన్నట్టు చూపించాలి.