మసాలా
 
 
 
 
కత్రినాకు తప్పిన ముప్పు
నడి సముద్రంలో షార్క్‌ల లాంటి ప్రమాదకరమైన చేపలు తిరిగే చోట అందమైన హీరోయిన్ ఈతలు కొడుతుంటే తెరమీద చూడటానికి మనకి బాగానే ఉంటుంది. అందులోనూ కత్రినా కైఫ్ లాంటి మల్లెతీగలు అలా చేస్తుంటే అంతా కళ్లప్పగించి చూస్తుంటారు. కానీ.. షూటింగ్‌లో ఈత కొడుతున్నప్పుడు తలమీద నుంచి షార్క్ చేప వెళ్తే.. అందులోనూ ఆ విషయం బయటకు వచ్చిన ఓ అరగంట తర్వాత తెలిస్తే ఎలా ఉంటుంది? జోయా అక్తర్ దర్శకత్వంలో వస్తున్న 'జిందగీ న మిలేగీ దుబారా' అనే చిత్రం షూటింగ్‌లో ఇంగ్లీషు బుల్లెమ్మ కత్రినాకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

నిజానికి ఈ చిత్రం కోసం ఒక ప్రైవేటు శిక్షకుడిని పెట్టుకుని మరీ బాంద్రాలోని ఆటర్స్ క్లబ్‌లో సముద్రపు లోతుల్లో ఎలా డైవింగ్ చేయాలో కత్రినా బాగానే నేర్చుకుంది. బాగా లోతుకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడానికి కొద్దిగా అలవాటు పడితే సరిపోతుందని భావించింది. కానీ, ఆమె షూటింగ్‌కు వెళ్లేసరికి సముద్రం బాగా అల్లకల్లోలంగా ఉంది. రెండు గంటలు పడవలో వెళ్లాక సముద్రంలోకి దూకాల్సిందిగా కోచ్ చెప్పాడు. అలా దూకి.. లోపల కాసేపు ఈది, మళ్లీ పైకి వచ్చిన తర్వాత తీరంలో ఉన్నవారంతా ఆమెవైపు ఆశ్చర్యపోయి నోళ్లు వెళ్లబెట్టుకుని చూస్తున్నారు. వాళ్లేదో వేళాకోళం చేస్తున్నారని ఆమె అనుకుంది.

కానీ.. లోపల ఈదేటప్పుడు తల మీద కొంచెం ఎత్తులోంచి ఓ షార్క్ చేప వెళ్లిందని సాంకేతిక సిబ్బంది కత్రినాకు చెప్పారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా కత్రినా హడలెత్తిపోయింది. చిత్రం షూటింగ్ సమయంలో మానసిక ఒత్తిడి, భయం కారణంగా తాను మూడు కిలోల బరువు తగ్గిపోయానని.. తర్వాత షూటింగ్ జరిగేటప్పుడు కూడా నడిచేటప్పుడు హృతిక్ చెయ్యి మామూలుగా పట్టుకోవాల్సి ఉండగా.. భయంతో తాను చాలా గట్టిగా పట్టుకున్నానని అమ్మడు స్వయంగా చెప్పింది.