జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘రన్నింగ్ విత్ ది బుల్స్’లో హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్, నేను, కల్కి కోచ్లిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నాం. కథానుసారం ఇందులో నేను ఫైట్లు చేయాలి. మామూలు పోరాట దృశ్యాలు కాదు.. బైక్ నడుపుతూ విలన్లను ఇరగదీయాలి. ఈ పాత్ర వినగానే 'అమ్మో .. నా వల్ల కాదు' అనలేదు. అంతు చూస్తా.. విలన్లను చితక బాదుతా అని సరదాగా అన్నాను. ఈ సన్నివేశాల్లో సరిగ్గా యాక్ట్ చేయడంకోసం ప్రస్తుతం ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకుంటున్నాను. నేనిప్పటివరకు లైట్ బైక్స్ నడిపాను కానీ హెవీ బైక్స్ నడపలేదు. ఈ సినిమాతో అవి కూడా నడపడం నేర్చుకుంటున్నాను. ఇక 'రాజ్‌నీతి' విషయానికొస్తే.. ఇందులో కొత్త కత్రినాని చూస్తారు. రాజకీయ నాయకురాలిగా చాలా హుందాగా కనిపిస్తాను. ఈ పాత్ర నా జీవితానికి మంచి మలుపు అవుతుంది. కత్రినాకు నటన తెలియదు అన్నవాళ్లే ఈ చిత్రం చూసిన తర్వాత అభినందల వర్షం కురిపిస్తారు. అహంభావంతో అంటున్న మాట కాదు.. ఆత్మవిశ్వాసంతో చెబుతున్నానని అంటోంది కత్రినాకైఫ్.
పధ్నాలుగేళ్ల వయసులో లండన్‌లో 'మోడలింగ్' ఆరంభించాను. లండన్‌కి చెందిన కైజాద్ గుస్తాద్ అనే సినీ నిర్మాత దృష్టి నా పై పడింది. ఆయనే 'బూమ్'కి అవకాశం ఇచ్చారు. దాంతో ముంబయ్‌కి మకాం మార్చాను. 'బూమ్' చిత్రం అంగీకరించినప్పుడు నాకు నటన గురించి ఏమీ తెలియదు. హిందీ భాష కూడా రాదు. సినిమాల్లో మన అదృష్టం ఎలా ఉంటుందో పరిక్షించుకుందామని ధైర్యంగా అడుగుపెట్టాను. ఆ చిత్రం ఫ్లాప్ అయ్యింది. భాష కూడా తెలియదు కాబట్టి కొంతమంది నిర్మాతలు నన్ను హీరోయిన్‌గా ఎన్నుకోవడానికి సంశయించారు. ఆ సంగతి అలా ఉంచితే తొలి విజయం ఎంత ఆనందాన్నిస్తుందో తొలి అపజయం కూడా అంతే నిరుత్సాహాన్నిస్తుంది. 'బూమ్' ఫ్లాప్ అయ్యిందని బాధపడుతున్న సమయంలో నాకు 'సర్కార్'లో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో అభిషేక్ బచ్చన్ గాళ్ ఫ్రెండ్‌గా ఓ క్యారెక్టర్ చేశాను. ఆ పాత్ర నాకు మంచి మార్కులు తెచ్చింది. ఆ తర్వాత 'మైనే ప్యార్ క్యోం కియా' చిత్రంలో సల్మాన్ ఖాన్ పక్కన యాక్ట్ చేశాను. ఆ సినిమా విజయం సాధించింది. దాంతో నా జీవితం మారిపోయింది. నమస్తే లండన్, పార్టనర్, వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్, న్యూయార్క్.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాను. నా ఈ ప్రయాణంలో నాకు అడుగడుగునా తోడున్న వ్యక్తి 'సల్మాన్ ఖాన్'.
సినిమా పరిశ్రమ గురించి నాకేమీ తెలియదు. సల్మాన్ ఇచ్చిన గైడెన్స్ వల్ల ఇప్పటిదాకా నెట్టుకు రాగలిగాను. నన్నెంతోమంది నిరుత్సాహపరిచారు. అందం తప్ప నటన లేదని కూడా విమర్శించారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం నువ్వు కచ్చితంగా సక్సెస్ అవుతావ్. బాలీవుడ్‌ని ఏలతావ్ అనేవారు. ఆయన మాటలు నాలో ఆత్మవిశ్వాసం కలిగించేవి. నిజానికి అప్పట్లో సల్మాన్ అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే నేనింత దాకా వచ్చేదాన్ని కాదు. అందుకే నా మనసులో ఆయనకు ప్రత్యేక స్థానం ఇచ్చా. సల్మాన్ కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మరో రెండేళ్లలో ఆయన్ని వివాహం చేసుకుంటున్నట్లు కల కన్నా. ఆ కల నిజం అవుతుందని అనుకుంటున్నాను. సల్మాన్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఎప్పుడు అనే విషయం మాత్రం చెప్పలేను.
|