Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
మంచివే చేస్తానంటున్న కత్రినా

     'రాజ్‌నీతి' చిత్రం నటిగా మంచి మార్కులు తెచ్చిపెట్టడంతో కత్రినా కైఫ్‌ అమితోత్సాహంలో ఉన్నారు. ఈ చిత్రంతో తన మీద ఉన్న 'గ్లామర్‌ డాల్‌' ముద్ర చెరిగిపోయినట్లుగా ఆమె భావిస్తున్నారు.

ఇక కత్రినా శ్రేయోభిలాషులైతే 'ఉత్తమ నటి'కి సంబంధించి బాలీవుడ్‌లో ఎన్ని అవార్డులు ఉన్నాయో అవన్నీ నీకే సొంతమవుతాయి అంటున్నారట. దాంతో కత్రినా సంతోషంతో తలమునకలవుతున్నారట. 'రాజ్‌ నీతి' ఇచ్చిన మంచి అనుభూతితో ఇకనుంచి నటనకు అవకాశం ఉన్న పాత్రలే చేయాలని కత్రినా నిర్ణయించుకున్నారట.

అందుకే ఓ మోస్తరుగా ఉన్న కథలను అంగీకరించడంలేదని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కత్రినాను ఓ ప్రాజెక్ట్‌ బాగా ఆకర్షించిందట. ఎలాగైనా ఆ చిత్రం తనకే దక్కాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నారట. గతంలో హేమమాలిని నటించిన 'సీత ఔర్‌ గీతా'ని రీమేక్‌ చేయాలని ఓ ప్రముఖ నిర్మాత అనుకుంటున్నారట. ఎలాగైనా ఆ చిత్రం తననే వరించాలనుకుంటున్న కత్రినాకు నిర్మాత దృష్టిలో ఉన్నది కూడా తనే అని తెలుసుకుని సంతోషపడుతున్నారు.. సీతగా, గీతగా.. ద్విపాత్రాభినయం చేసేసి బాలీవుడ్‌లో మరిన్ని మార్కులు కొట్టేయాలనుకుంటున్నారామె.

ఆ నిర్మాత కూడా ఇటీవల కత్రినాని కలిశారట. ఎన్ని రోజులు డేట్స్‌ కావాలన్నా ఇస్తానంటూ కత్రినా పచ్చజెండా ఊపారని సమాచారం. పకడ్బందీగా షూటింగ్‌కు రంగం సిద్ధం అయిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టాలనుకుంటున్నారట. ప్రస్తుతం కత్రినా 'తీస్‌ మార్‌ ఖాన్‌'లో నటిస్తున్నారు. ఇది కాకుండా 'జిందగీ న మిలేంగీ ...' అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారట. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుంది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005