‘ది లాస్ట్ వరల్డ్: జురాసిక్ పార్క్’, ‘10,000 బీసీ’ వంటి సూపర్‌డూపర్ సినిమాలో నటించిన కేమిలా బెల్ గురించి ప్రత్యేక
పరిచయం ఏమీ అక్కర్లేదు. హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన ఈమె హిందీ సినిమాలు చేయడానికి కూడా రెడీ
అంటోంది. అక్షయ్ కుమార్ తాజాగా నిర్మించిన కెనడియన్-ఇండియన్ చిత్రం ‘స్పీడీ కింగ్స్’లో కేమిలా హీరోయిన్. హిందీ
సినిమాలు అంటే చాలా ఇష్టమని, వీటిలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ 24 ఏళ్ల బ్యూటీ చెప్పింది. ‘మంచి కథ,
చక్కని అవకాశం అనుకుంటే హిందీ సినిమా చేయడానికి అభ్యంతరం లేదు. ఇది వరకే కొన్ని బాలీవుడ్ సినిమాలు
చూశాను.
ఇటీవల ధూమ్ చూశాను. చూస్తున్నంత సేపూ దానికే అతుక్కుపోయాను. దాంట్లోని పాటలు, డాన్సులు చాలా
బాగున్నాయ్’ అని వివరించింది. భారత్‌ను సందర్శించాలని ఎప్పుడూ కోరుకుంటానని, ఈ పర్యటనను ఎంతో
ఆస్వాదించానని మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన కేమిలా చెప్పింది. భారత్.. ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం వంటిదని, నిజంగా
అద్భుతమైన దేశమని అభివర్ణించింది. స్పీడీకింగ్స్ స్క్రిప్టులోని సాంస్కృతికపరమైన అంశాలు ఎంతో ఆకట్టుకున్నాయని
ఆమె చెప్పింది. ‘ఇందులో తండ్రీకొడుకుల సంబంధాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. నేను విభిన్న సాంస్కృతిక నేపథ్యాల
నుంచి వచ్చినదాణ్ని. అమ్మ బ్రెజిలియన్ అయినా నేను పుట్టిపెరిగింది పాశ్చాత్య దేశాల్లో. నేనెవరో తెలుసుకోవడానికి
ఎప్పుడూ అన్వేషిస్తుంటాను.
పాశ్చాత్యదేశాల్లో కనిపించని ప్రేమ, బంధాల గురించి ఈ సినిమా చెబుతుంది’ అని కేమిలా వివరించింది. స్పీడీకింగ్స్‌లో
భారతీయ నటులతో కలిసి పనిచేయడం మంచి అనుభూతిని కలిగించదని చెప్పింది. సినిమా షూటింగులోనూ కుటుంబ
వాతావరణం కనిపించేదని, భారతీయ సంస్కృతి అంటే ఏమిటో గ్రహించానని తెలిపింది. అనుపమ్ ఖేర్‌తో కలిసి
పనిచేయడం ఎలా ఉందంటే.. చక్కటి వృత్తినిబద్ధత ఉన్న నటుడు అయన అని ప్రశంసించింది. అనుపమ్‌లో దాగున్న
జ్ఞానాన్ని చూసి ముగ్ధురాలినయ్యానని కేమిలా బెల్ ఆశ్చర్యపోయింది.