నాలుగు రోజులు- హోం పేజీలో పదిహేను లక్షల హిట్లు..కనీసం పది లక్షల డౌన్‌లోడ్లు.. దేశం మొత్తం మీద తమిళ పాట "వై దిస్ కొలైవెరి..ది..'' (హత్య చేయాలన్నంత క్రోథం ఎందుకు ..?) సృషిస్టున్న సంచలనమిది. అంతే కాకుండా తెంగ్లిష్ (తమిళ్, ఇంగ్లిషు మిశ్రమం)లో ఈ పాట ఉండటం కుర్రకారును కిర్రెకిస్తోంది. కేవలం నెట్‌లో మాత్రమే కాదు.. ఇటు ట్విట్టర్‌లోను దుమ్ములేపుతోంది. అటు గూగుల్‌లో కూడా ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పాటగా కూడా రికార్డులు సృష్టిస్తోంది.
3 (సినిమా పేరు) షూటింగ్ జరుగుతున్న సమయంలో లవ్ ఫేల్యూర్ సిట్యూయేషన్‌కు ఒక పాట అవసరం వచ్చింది. ఈ సినిమాలో హీరోకి పెద్దగా ఇంగ్లిషు రాదు. లవ్ ఫేల్యూర్ కావటంతో కొద్దిగా మందేస్తాడు. ఆ పాట బాగా సీరియస్‌గా ఉండకూడదు. అలాగని తేలిపోకూడదు. అలాంటి పాట కావాలని సినిమా నిర్మాత సౌందర్య రజనీకాంత్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను తొందర పెట్టడం మొదలుపెట్టింది. అనిరుధ్ పదినిమిషాల్లో ట్యూన్ ఇచ్చేశాడు. మరి పాటో.. ఈ ట్యూన్ విని- సినిమా హీరో, సౌందర్య భర్త, ధనుష్ చిన్నగా పాడటం మొదలుపెట్టాడు.
వాటిలో ఉన్నవి 90 శాతం ఇంగ్లిషు పదాలు.. మధ్య మధ్యలో తమిళపదాలు. వెంటనే మ్యూజిక్ డైరక్టర్ థనుషే ఈ పాట పాడితే బావుంటుందని ప్రతిపాదించాడు. ధనుష్ సిద్ధపడ్డాడు.. "మొత్తం అంతా ఇరవై నిమిషాల్లో జరిగిపోయింది. పాట హిట్ అవుతుందనుకున్నాం కాని ఇంత పాపులర్ అవుతుందనుకోలేదు'' అంటాడు అనిరుద్. పాటకు సంబంధించి- సౌందర్య, హీరోయిన్ శృతి హాసన్‌లు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు.
ఎందుకింత పాపులారిటీ?
ఇంగ్లిషు మాట్లాడాలని అందరికి ఉంటుంది. కాని గ్రామర్ రాదు. పదాలు తెలియవు. తమకు తెలిసిన పదాలతో తమదైన శైలిలో ఇంగ్లిషు మాట్లాడేవారు ఎంతో మంది. అలాంటి వారందరికి సమస్యను ఈ పాట బయటపెట్టింది. అంతే కాకుండా పాటలు సంప్రదాయబద్ధంగా, రాగయుక్తంగా ఉండాలనే భావనను కూడా ఈ పాట బ్రేక్ చేస్తుంది. అందుకే తమిళ్ యాసలో ఉండే ఇంగ్లిషును దేశవ్యాప్తంగా కుర్రకారు ఎంజాయ్ చేయగలుగుతున్నారు.