కేవలం సినీతారలు, ప్రముఖులే ఎక్కువగా కనిపించే కలర్స్ చానెల్ బిగ్‌బాస్ 5 షోలో ఒక లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తి
ప్రవేశించడం సాధారణ విషయం ఏమీ కాదు. సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణ్ త్రిపాఠీ మాత్రం నిస్సంకోచంగా ఇందులోని
ప్రవేశించారు. అదృష్టం బాగా లేకపోవడంతో 42 రోజుల తరువాత ఆ షో నుంచి ఆదివారం బయటికి రావాల్సి వచ్చింది. స్వయంగా
లింగమార్పిడి చేయించుకొని తనలాంటి వాళ్ల సంక్షేమం కోసం 12 ఏళ్లుగా పోరాడుతున్న వ్యక్తి ఆమె. తనవర్గం వాళ్ల గురించి
సమాజానికి తెలియజేయాలనే ఆలోచనతోనే ఇందులో ప్రవేశించానని లక్ష్మి చెప్పారు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చినందుకు బాధేమీ
లేదన్నారు.
షో అతిథేయి సల్మాన్ ఖాన్ ఈ విషయంలో తనకు సహకరించారని చెప్పారు. ఇంతకుముందు సల్మాన్ అతిథేయిగా వ్యవహరించిన
దస్ కా దమ్ షోలోనూ లక్ష్మి తొలిసారిగా పాల్గొన్నారు. ‘సల్మాన్ దమ్మున్న మనిషి. నేను లింగమార్పిండి చేయించుకున్న వ్యక్తినే
అయినా దస్ కా దమ్‌లో నాకు స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మా లాంటి మనుషులు కూడా ప్రేమాభిమానాలతో అందరిలాగే
సాధారణ జీవితం గడపగలరని నిరూపించడానికి బిగ్‌బాస్‌లో ప్రవేశించాను. వాళ్లపై వివక్ష చూపడం సరికాదని చాటిచెప్పడానికి
ప్రయత్నించాను’ అని లక్ష్మి వివరించారు. సచ్ కా సామ్నా షోలో చేసిన విధంగా ప్రజలకు తమవర్గం గురించిన వాస్తవాలను
తెలియజేయాల్సి ఉందన్నారు. అందుకే వివాదాస్పద టీవీ షోల్లో పాల్గొంటున్నానని వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం బిగ్‌బాస్ ఐదో సీజన్ నడుస్తోంది. ఇందులోకి వెళ్లిన 14 మంది పోటీదారుల్లో లక్ష్మి ఒకరు. సల్మాన్‌తోపాటు సంజయ్‌దత్ దీనికి
అతిథేయిగా వ్యవహరిస్తున్నారు. ఈవారం లక్ష్మితోపాటు పూజామిశ్రా, మహెక్‌చహల్, ఆకాశ్‌దీప్ సైగ్‌లు షోకు నామినేట్ అయ్యారు.
అందరు పోటీదారుల మాదిరిగానే లక్ష్మికి కూడా షోలో ఇబ్బందులు తప్పలేదు. పూజామిశ్రాతో ఆమెకు మనస్పర్థలు వచ్చాయి. పూజా
ఇంతకుముందు షోల్లోనూ కనిపించిందని, అందుకే ఆమె అందరితోనూ గొడవలు పెట్టుకుందని లక్ష్మి విమర్శించారు.
మిగతావాళ్లందరూ తనతో ఎంతో మర్యాదగా ప్రవర్తించే వాళ్లని వివరించారు.