మసాలా
 
 
 
 
ఆత్మతృప్తి కోసం మడోన్నా సేవా కార్యక్రమాలు
‘‘మన కోసం మనం బతకడం కామన్. కానీ జనాల కోసం బతికినప్పుడే ఆ జీవితానికి ఓ అర్థం ఉంటుంది’’ అంటున్నారు పాప్ స్టార్ మడోన్నా. గాయనిగా, నటిగా, దర్శకురాలిగా.. ఇలా సినిమాకి సంబంధించిన పలు శాఖల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు ఈ గ్లామర్ క్వీన్. మడోన్నాది కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అంతః సౌందర్యం కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. అందుకు నిదర్శనం ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలే.

2006లో ఆఫ్రికన్ కంట్రీకి చెందిన ఐదేళ్ల బాలుడ్ని, 2009లో ఆరేళ్ల పాపను దత్తత తీసుకున్నారు మడోన్నా. తన ఇద్దరు పిల్లలతో సమానంగా వీరిని పెంచుతున్నారామె. అలాగే మలావీలో గల పేద బాలికలను చదివించడానికి కొంత నిధిని కూడా సమకూర్చారు. ప్రపంచంలోనే అతి తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మలావీ ఒకటి. ముఖ్యంగా 67 శాతం బాలికలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఇది గమనించిన మడోన్నా తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సదరు బాలికలను చదివించడానికి పూనుకున్నారు. అలాగే ఓ అనాథ శరణాలయం కట్టించడానికి సన్నాహాలు మొదలుపెట్టారామె.

ఈ శరణాలయంలో దాదాపు వెయ్యి మంది అనాథ బాల, బాలికలకు ఆశ్రయం కల్పించాలనుకుంటున్నారు. ఈ విషయం గురించి మడోన్నా చెబుతూ -‘‘పాప్ సింగర్‌గా, నటిగా ఎంత కీర్తి సంపాదించినా లభించని ఆత్మసంతృప్తి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు దొరుకుతుంది. అందుకే వీలైనంత ఎక్కువగాసహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాను’’ అన్నారు.