మసాలా
 
 
 
 
మహేష్‌బాబు సెల్ఫ్-హెల్ప్ సీక్రెట్
సినిమాల్లో ఎంతో సీరియస్‌గా రెండుమూడు డైలాగులు చెప్తూ మాటలను పొదుపుగా వాడే మహేష్‌బాబు కెమెరా బయట నిజజీవితంలో కూడా అలానే ఉంటాడు. పెదవుల మీద చిరునవ్వు చెరగదు. ఏ మాత్రం తొణకడు. ఇదెలా సాధ్యమవుతోంది మహేష్‌కి? సీక్రెట్ ఏమై ఉంటుందనే సందేహం వచ్చింది కదూ. దీని వెనక ఉన్న సింపుల్ సీక్రెట్ పుస్తకపఠనం. అవి కూడా స్వయంసహాయక (సెల్ఫ్-హెల్ప్) పుస్తకాలు. "ఆలోచనలు రేకెత్తింపచేసే ఈ పుస్తకాలే ఎదుటివ్యక్తులను, విషయాలను అర్థంచేసుకునే శక్తిని, వాస్తవాలను గ్రహించే విజ్ఞతను ఇస్తాయి. అందుకనే పుస్తకపఠనానికి సమయాన్ని కేటాయించుకుంటాను.

బుర్రపై ఎప్పుడూ ఆలోచనల దాడి ఉంటుంది. దానివల్ల ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతత కోల్పోతాం. అలా జరగకుండా ఉండాలంటే పుస్తకాలు చదవాలి. అందుకే రాత్రి పడుకునేముందు సెల్ఫ్-హెల్ప్ పుస్తకాలు చదువుతాను'' అంటాడు మహేష్. ఒత్తిడిని నివారించడంతోపాటు ఆత్మను పరిశుద్ధం చేయడంలో కూడా పుస్తకాలు ఉపయోగపడతాయా అని అడిగితే "పూర్తిగా ప్రభావం చూపుతాయని అనను. కాని ఎదుటివాళ్లను అర్థంచేసుకునేందుకు ఇవి బాగా పనికొస్తాయి. పరిపూర్ణమైన వ్యక్తిగా మనని మనం తీర్చిదిద్దుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి'' అని ఒక చిరునవ్వు విసిరాడు. ఇప్పటికి మహేష్‌బాబు అందమైన చిరునవ్వు వెనక, సింపుల్‌గా ఉండే తీరు వెనక ఉన్న రహస్యం తెలిసింది కదా అందరూ అనుసరిస్తే సరి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండొచ్చు.