కోలీవుడ్‌లో ఇంతకు ముందు కనిపించిన మమతను మరచిపోండి. కొత్త మమత మీ ముందుకు వస్తోంది
అంటున్నారు మమతా మోహన్‌దాస్. శివప్పదికారం చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ కేరళ
సుందరి ఆ తర్వాత గురు ఎన్ ఆలు చిత్రంలో నటించారు. రెండు చిత్రాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఆశించిన విజయాలు రాలేదు.
తెలుగు పరిశ్రమలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని
అనుకున్నారు. కేరళలో అవకాశాలు దక్కించుకుని సక్సెస్ అయ్యారు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ కోలీవుడ్‌లోకి
వచ్చారు. అరుణ్ విజయ్‌కు జంటగా తడైయార తక్క చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మమతతో చిన్న
భేటీ...
చాలా గ్యాప్ వచ్చినట్టుంది?
నేను కోలీవుడ్‌లోకి ప్రవేశించి ఆరేళ్లు అయ్యింది. ఈ కాలంలో నేను చేస్తున్న మూడవ తమిళ చిత్రం
తడైయార్ తక్క. కథ తనకు విని పించడానికి వచ్చినప్పుడు దర్శకుడు ముగిళ్ తిరుమణి ఒక్కటే అన్నారు. కథ
రాసే సమయంలో నా మదిలో ఉన్న హీరోయిన్లలో మీరొకరు అని. అయితే నేను తమిళంలో నటించడం లేదని
కొందరు చెప్పడంతో వేరే హీరోయిన్లపై దృష్టి సారించారట. ఆయన చెప్పింది నిజమే ఇక్కడ నాతో చాలామంది
గేమ్ ఆడుకున్నారు.
ఈ చిత్రం నుంచి బాలీవుడ్ నటి ప్రాచి దేశాయ్ వైదొలగడంతోనే మీరు నటిస్తున్నారన్న విషయం తెలుసా?
ఇంతకు ముందు ఏమి జరిగిందనేది అనవసరం. ఒక మంచి స్క్రిప్టులో నటిస్తున్నందుకు చాలా
హ్యాపీగా ఉంది. అదృష్టం ఏమిటంటే నేను నటించాల్సిన ఒక మలయాళ చిత్రం షూటింగ్ వాయిదాపడింది.
కరెక్టుగా అలాంటి సమయంలో ఈ అవకాశం వచ్చింది.
ఇది యాక్షన్ కథా చిత్రం కదా.. ఇందులో మీ పాత్రకు ప్రాముఖ్యత ఏముంటుంది?
మీరు చెప్పింది నిజమే. ఇది యాక్షన్ కథా చిత్రమే. అయితే ఇందులో నాది డ్యూయెట్లకు మాత్రమే
పరిమితమయ్యే పాత్ర కాదు. హీరోకు సమానంగా నటనకు అవకాశమున్న పాత్ర. గౌతమ్‌మీనన్ శిష్యుడైన ఈ
చిత్ర దర్శకుడు ముగిళ్‌తిరుమణి ప్రేమ సన్నివేశాలను వైవిధ్యంగా ఆవిష్కరిస్తున్నారు. అరుణ్ విజయ్‌తో కలసి
నటించడం ఆనందంగా ఉంది.
తమిళ చిత్రాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడానికి కారణం?
తమిళంలో నటించనని నేనెప్పుడూ చెప్పలేదు. కెరీర్ తొలిదశలో కొన్ని లోపాలు జరి గాయి. నేను
ఊహించిన విధంగానే శివప్పదికా రం, గురు ఎన్ ఆలు చిత్రాలు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ చిత్రాల్లో
నాకు సరైన ప్రచారం రాలేదు. అందుకే అంటున్నా ఆ మమతను మరచిపోండి.. ఇప్పుడు తమిళంలో మళ్లీ కెరీర్
ప్రారంభిస్తున్నా.. తప్పక విజయం సాధిస్తా.