మసాలా
 
 
 
 
చెప్పుకోవడానికి సిగ్గుపడను
తన అందచందాలతో, ఆటపాటలతో అలరించిన ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్‌. గమ్మత్తయిన గొంతుతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. వెంకటేష్‌, నాగార్జున, ఎన్టీఆర్‌ తదితర అగ్ర కథానాయకులతో నటించి, మంచి నటిగా గుర్తింపు అందుకుంది. అయితే ఈమధ్య ఇక్కడ అవకాశాలు తగ్గటంతో మళయాళంపై దృష్టి పెట్టింది. అక్కడ పలు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఆ మధ్య క్యాన్సర్‌తో బాధపడింది. వ్యాధి ఉందని తెలిసినా, మొక్కవోని ధైర్యంతో పోరాడింది. చివరికి క్యాన్సర్‌పై గెలిచింది.

తాజా విశేషమేమిటంటే...ఈ ముద్దుగుమ్మ త్వరలోనే నటనకు స్వస్తి చెప్పాలను నిర్ణయించుకుందట. అందుకే ఎక్కువ సినిమాల్ని ఒప్పుకోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్లో మాత్రమే నటించేందుకు మొగ్గు చూపుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నటనకు దూరమై సమాజసేవలో పాల్గొనాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 26 ఏళ్ల కథానాయిక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట.

ప్రస్తుతం మళయాళంలో రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లీలా' అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుంది. 'సౌమ్యమ్‌ దీప్తమ్‌' అనే థ్రిల్లర్‌ సినిమాలోనూ నటిస్తోంది. మమ్ముట్టీ నిర్మాణంలో తెరకెక్కుతున్న మొట్టమొదటి చిత్రం 'మాతిలుకల్‌కపురమ్‌'లోనూ ప్రధాన పాత్ర పోషించే అవకాశం చేజిక్కించుకుంది.

ఇక తమిళంలో 'బిల్లా 2' లో చేయడానికి అంగీకారం తెలిపింది. 'ఇప్పటికే చాలా సినిమాలు చేస్తున్నా. ఇక వేరే చిత్రాలేవీ ఒప్పుకొనే ఆలోచన లేదు' అని వివరించింది. మరికొన్ని బాలీవుడ్‌ సినిమాలూ తలుపుతట్టాయని, అయితే అక్కడ చేయటం ఇష్టంలేకే ఒప్పుకోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తన జబ్బు గురించి చెబుతూ...'నాకున్న జబ్బు గురించి చెప్పుకోవడానికి నేనెప్పుడూ సిగ్గుపడను. ఇది ఇతరులకు చెప్పుకొన్నప్పుడే ఎంతోకొంత మేలు జరుగుతుంది. నేను జబ్బుతో బాధపడుతున్నా, నా పనులకు ఎలాంటి ఆటంకం రాలేదు. సాధారణంగానే షూటింగ్స్‌లో పాల్గొంటున్నా. ఒక విధంగా నాకు కాకుండా ఈ జబ్బు వేరే ఎవరికైనా వస్తే, చాలా ఇబ్బంది అయ్యేది. ఆర్థికంగా తట్టుకోవటం కష్టం' అని చెప్పింది.