Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘పాప్ కింగ్’ మైకేల్‌ది హత్యే

     ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచిన పాప్‌ రారాజు మైకేల్‌ జాక్సన్‌ అకాల మరణం వెనక మిస్టరీ ఎట్టకేలకు వీడింది. జాక్సన్‌ది సహజ మారణం కాదని భావించిన జాక్సన్‌ కుటుంబ సభ్యులతోపాటు యావత్‌ ప్రపంచం అనుమానం నిజమైంది. పాప్‌ సంగీత సామ్రాట్‌ హత్యకు గురయ్యారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాక్సన్‌ ఒరిజినల్‌ డెత్‌ సర్టిఫికెట్‌ను సంపాదించడం ద్వారా ప్రముఖ బ్రిటీష్‌ పత్రిక 'న్యూస్‌ ఆఫ్‌ ద వరల్డ్‌' సగటు సంగీతాభిమానిని తీవ్రంగా కలచివేసే ఈ కఠోర వాస్తవాన్ని బయటపెట్టింది.

గత ఏడాది జూన్‌ 25న జాక్సన్‌ మరణించిన తర్వాత జూలై 7న షెరిల్‌ మేక్‌విల్లీ అనే వైద్యాధికారి డెత్‌ సర్టిఫెకెట్‌ జారీ చేశారు. ఇందులో మరణ కారణాన్ని వెల్లడించలేదు. ఆ తర్వాత ఆగస్టు 31న క్రిస్టఫర్‌ రోజర్స్‌ అనే మరో వైద్యాధికారి జారీ చేసిన డెత్‌సర్టిఫికెట్‌లో హత్యచేయడం వల్లనే మైకేల్‌ జాక్సన్‌ మరణించినట్లు స్పష్టం చేశారు. ఇంట్రావీనస్‌ ఇంజక్షన్‌ ద్వారా 'ప్రొపొఫాల్‌' అనే మాదక పదార్థాన్ని మోతాదుకు మించి ఎక్కించడం వల్లనే మరణించినట్లు ఇందులో వెల్లడించారు. జాక్సన్‌ మరణానికి సంబంధించి, అతడికి వైద్యం చేసిన డాక్టర్‌ కోన్రాడ్‌ ముర్రేపై లాస్‌ ఏంజిలెస్‌ పోలీసులు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

హూస్టన్‌కు చెందిన ఒక న్యాయవాద సంస్థ ముర్రే తరఫున వాదిస్తోంది. అయితే పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని జాక్సన్‌ కుటుంబ సభ్యులు అంటున్నారు. మైకేల్‌ మరణానికి బాధ్యుడైన వ్యక్తిని శిక్షించాలని వారు కోరుకుంటున్నట్లు జాక్సన్‌ కుటుంబ సన్నిహితుడు ఒకరు తెలిపారు. కేసులో న్యాయం జరిగేంత వరకు మైకేల్‌ తండ్రి జో జాక్సన్‌ విడిచిపెట్టబోరని చెప్పారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005