మసాలా
 
 
 
 
మైకేల్ జాక్సన్ జీవితకధతో సినిమా
కడలి గర్భం నుంచి ఉప్పొంగే కెరటమే ఆదర్శంగా ప్రపంచ కాన్వాస్‌పై తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న పాప్ రారాజు... మైకేల్ జాక్సన్. ఎగిసి పడుతున్నందుకు కాదు... పడినా పైకి లేస్తున్నందుకే కెరటం తనకు ఆదర్శమని చెప్పుకున్న ఆయన... దేహాన్ని విడిచి చూస్తూ ఉండగానే రెండేళ్లు గడిచిపోయింది. ఆ పాప్ కింగ్‌కు బాల్యం నుంచి అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి. తండ్రి నుంచి నిరాదరణ.. బంధువుల నుంచి ఛీత్కరింపులు... స్థానికుల నుంచి వర్ణ వివక్ష... ఇలా అన్నీ అతడిని వెంటాడాయి.

ఆ వివక్షలో తనను తాను ప్రత్యేకంగా చూసుకున్నారు జాక్సన్. స్ప్రింగ్ లాంటి తన దేహాన్నే, మధురమైన తన గొంతును అస్త్రాలుగా చేసుకొని పాప్ నాట్య జగతిలో తన సత్తాను చాటుకున్నారు. ప్రపంచంలో కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో రారాజుగా నిలిచిపోయారు. ఆ కింగ్ వెనుక దాగిన విషాదం, వరించిన విజయాలు నేపథ్యంగా ‘మైకెల్ జాక్సన్: ది లైఫ్ ఆఫ్ ఆన్ ఐకాన్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆండ్రూ ఈస్టల్ దర్శకత్వం వహించగా, మైకేల్ బాల్య మిత్రుడు డేవిడ్ గేస్ట్ నిర్మాతగా వ్యవహరించారు. దీనిలో జాక్సన్ బాల్య మిత్రుల ఇంటర్వ్యూలతో పాటు అతడి పెద్దక్క రెబ్బీ ఇంటర్వ్యూను కూడా జోడించారు. జాక్సన్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, విజయాలను ఈ సినిమా ద్వారా ఆయన అభిమానులకు చూపించేందుకు ప్రయత్నించామని దర్శకుడు తెలిపారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.